దిగ్గజ పర్సనాలిటీపై కూడా వైసీపీ నేతలు చేస్తున్న నీచ వ్యాఖ్యలు అందరికీ బాధ కలిగిస్తున్నాయి. వైసీపీ ప్రభుత్వ పోకడలపై ఆయన చిన్న విమర్శ చేయలేదు.. మీ పార్టీ నేతల విమర్శలు ఆకాశంపై ఉమ్మి వేయడమే. నోటిదూల నేతలను జగన్ అదుపులో పెట్టుకోవాలి..
తమిళనాడు (Tamil Nadu) ప్రజల ఆరాధ్య దైవం.. తెలుగు ప్రజలతో అవినాభావ సంబంధం కలిగిన దిగ్గజ నటుడు రజనీకాంత్ (Rajinikanth). అలాంటి నటుడిపై ఏపీ మంత్రులు, వైఎస్సార్ సీపీ (YSRCP) ఎమ్మెల్యేలు, నాయకులు తీవ్ర విమర్శలు చేశారు. విజయవాడలో జరిగిన ఎన్టీఆర్ (NT Rama Rao) శత జయంతి ఉత్సవాల్లో రజనీకాంత్ చేసిన ప్రసంగంపై దారుణంగా.. విలువలు మరచి.. వ్యక్తిత్వాన్ని దిగజార్చేలా తీవ్ర విమర్శలు చేశారు. ఈ విమర్శలపై ఏపీ ప్రజలతో పాటు సినీ పరిశ్రమకు చెందిన వారు ఖండిస్తున్నారు.
ఇక రజనీకాంత్ అభిమానులు అయితే ఏపీ మంత్రులు (Ministers), వైసీపీ నాయకులపై భగ్గుమంటున్నారు. సీఎం జగన్ (YS Jagan), వైఎస్సార్ సీపీ క్షమాపణలు చెప్పాలని సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ఉద్యమం మొదలుపెట్టారు. కాగా ఈ విమర్శలను ఏపీలోని రాజకీయ నాయకులు కూడా తప్పుబడుతున్నారు. రజనీపై విమర్శలు చేయడాన్ని ప్రతిపక్ష నాయకుడు, తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు (Nara Chandrababu Naidu) ఖండించారు. నోటిదూల నేతలను జగన్ అదుపులో పెట్టుకోవాలని హెచ్చరించారు. రజనీకాంత్ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు ట్విటర్ లో పోస్టు చేశారు.
‘అన్నగారి శత జయంతి కార్యక్రమంలో పాల్గొని ఆయనతో తన అనుబంధాన్ని.. అనుభవాలను పంచుకున్న సూపర్ స్టార్ రజనీకాంత్ పై వైసీపీ మూకల అసభ్యకర విమర్శల దాడి అభ్యంతరకరం.. దారుణం. సమాజంలో ఎంతో గౌరవం ఉండే రజనీ కాంత్ లాంటి దిగ్గజ పర్సనాలిటీపై కూడా వైసీపీ నేతలు చేస్తున్న నీచ వ్యాఖ్యలు అందరికీ బాధ కలిగిస్తున్నాయి. వైసీపీ ప్రభుత్వ పోకడలపై ఆయన చిన్న విమర్శ చేయలేదు.. ఎవరినీ చిన్న మాట అనలేదు. పలు అంశాలపై కేవలం తన అభిప్రాయాలు పంచుకున్నారు. అయినా తీవ్ర అహంకారంతో ఆయనపై చేస్తున్న అర్థం లేని విమర్శలను తెలుగు ప్రజలు ఎవరూ సహించరు. శిఖరం లాంటి వ్యక్తిత్వం కలిగిన రజనీ క్యారెక్టర్ (Character)పై మీ పార్టీ నేతల విమర్శలు ఆకాశంపై ఉమ్మి వేయడమే. నోటిదూల నేతలను జగన్ అదుపులో పెట్టుకోవాలి.. జరిగిన దానికి క్షమాపణ చెప్పి తమ తప్పు సరిదిద్దుకోవాలి’ అని చంద్రబాబు డిమాండ్ చేశారు.