»Former Cs Somesh Kumar Political Entry Fixed Unofficially Joins In Brs Party
మాజీ CS సోమేశ్ కుమార్ BRSలో చేరారా.? ఇది నిజమా? KCR ప్లానేంటి?
గతంలో ప్రధాన కార్యదర్శులు, ఇతర అధికారులుగా పని చేసిన వారిని కేసీఆర్ తన వెన్నంటే ఉంచేసుకున్నారు. బిహార్ రాష్ట్రానికి చెందిన సోమేశ్ ను అక్కడి ఎన్నికల్లో పోటీ చేసేలా కేసీఆర్ ప్రణాళిక రచిస్తున్నట్లు సమాచారం. 2024 ఎన్నికల్లో మధుబని లోక్ సభ స్థానం నుంచి బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసే అవకాశాలు లేకపోలేదు.
తెలంగాణతో అపూర్వ అనుబంధం.. ఎనిమిదేళ్లుగా తెలంగాణలో (Telangana) వివిధ హోదాల్లో పని చేసిన ఐఏఎస్ అధికారి. రాష్ట్ర అత్యున్నత పదవి ప్రధాన కార్యదర్శిగా (State Cheif Secretary) బాధ్యతలు చేపట్టారు. బలవంతంగా.. కుట్రపూరితంగా తెలంగాణ నుంచి ఆయనను దూరం చేశారు. అయినా కూడా ఆయనకు తెలంగాణపై అభిమానం తగ్గలేదు. పక్క రాష్ట్రానికి పంపినా తెలంగాణతోనే అనుబంధం కొనసాగిస్తున్నారు. ఆయనే సోమేశ్ కుమార్ (Somesh Kumar). అధికారికంగా సీఎం కేసీఆర్ (K Chandrashekar Rao)తో కలిసి పని చేసిన సోమేశ్ కుమార్ అనంతరం కోర్టు ఆదేశాలతో ఏపీకి (AP) వెళ్లారు. కానీ సీఎం కేసీఆర్ ను వదిలి వెళ్లేందుకు మనస్కరించలేదు.
ఈ క్రమంలోనే బీఆర్ఎస్ పార్టీ (BRS Party) నిర్వహించిన సమావేశంలో ఆయన ప్రత్యక్షమయ్యారు. మహారాష్ట్రలోని (Maharashtra) ఔరంగాబాద్ (Aurangabad)లో సోమవారం నిర్వహించిన బీఆర్ఎస్ బహిరంగ సభలో సోమేశ్ కుమార్ కనిపించారు. పార్టీ అధినేత, సీఎం కేసీఆర్ (KCR) అతడిని ప్రత్యేకంగా ప్రస్తావించారు. మహారాష్ట్ర పర్యటనలో కేసీఆర్ వెన్నంటి సోమేశ్ ఉన్నారు. ఇన్నాళ్లు అధికారిక సమావేశాల్లో పాలుపంచుకున్న సోమేశ్ తొలిసారి రాజకీయ కార్యక్రమంలో పాల్గొన్నారు. తెలుగు ప్రజలు ఈ సమావేశంలో సోమేశ్ పాల్గొనడం ప్రత్యేకంగా చూశారు. ‘సోమేశ్ కుమార్ తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా పని చేశారు. తెలంగాణను ఒక మోడల్ (Telangana Model) రాష్ట్రంగా తీర్చిదిద్దడంలో కృషి చేశారు. తెలంగాణ అభివృద్ధి కోసం నాతో పాటు 24 గంటల పాటు కలిసి పని చేసిన గొప్ప వ్యక్తి’ అంటూ సభలో సోమేశ్ కుమార్ పై సీఎం కేసీఆర్ ప్రశంసల వర్షం కురిపించారు.
ఈ సభకు హాజరవడంతో సోమేశ్ తన అధికార బాధ్యతలకు వీడ్కోలు పలికినట్టే అనే విషయం స్పష్టమైంది. ఏపీకి వెళ్లినా ఎలాంటి పోస్టింగ్ రాకపోవడంతో సోమేశ్ కుమార్ తెలంగాణకు పరిమితమయ్యారు. ఈ క్రమంలోనే ఆయన స్వచ్ఛంద పదవి విరమణకు (VRS) దరఖాస్తు చేసుకున్నారని సమాచారం. అందుకే అధికారిక విధులకు దూరంగా ఉన్నారు. తాజాగా రాజకీయ కార్యక్రమంలో పాల్గొనడంతో ఆయన అధికారికంగా వైదొలిగినట్టే. త్వరలోనే బీఆర్ఎస్ విస్తరణలో సోమేశ్ కీలక పాత్ర పోషించే అవకాశం ఉంది. బిహార్ (Bihar) రాష్ట్రానికి చెందిన సోమేశ్ ను అక్కడి ఎన్నికల్లో పోటీ చేసేలా కేసీఆర్ ప్రణాళిక రచిస్తున్నట్లు సమాచారం. 2024 ఎన్నికల్లో మధుబని (Madhubani) లోక్ సభ స్థానం నుంచి బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసే అవకాశాలు లేకపోలేదు. జాతీయ రాజకీయాల్లో కేసీఆర్ కు తోడుగా సోమేశ్ నిలువనున్నాడు. గతంలో ప్రధాన కార్యదర్శులు, ఇతర అధికారులుగా పని చేసిన వారిని కేసీఆర్ తన వెన్నంటే ఉంచేసుకున్నారు. రాజీశ్ శర్మ, వెంకట రమణారెడ్డి తదితరులు కేసీఆర్ పక్కన ఉన్నారు. తాజాగా ఆ జాబితాలో సోమేశ్ కూడా చేరిపోయారు. త్వరలోనే ఆయన ఐపీఎస్ బాధ్యతల విషయమై స్పష్టమైన ప్రకటన వచ్చే అవకాశం ఉంది.