»Telangana High Court Supported To Tspsc Decisions On Competitive Exams
Telangana ప్రభుత్వానికి ఊరట.. పరీక్షల రద్దు సబబే: High Court
బీజేపీ, కాంగ్రెస్ నేతలను ఎందుకు పిలిచారు? అని న్యాయస్థానం ప్రశ్నించింది. విచారణ చేసిన నాయకుల నుంచి ఏమైనా సమాచారం సేకరించారా? కోర్టు వివరాలు అడిగింది. ఈ వ్యవహారంపై ఈనెల 28వ తేదీన మధ్యంతర ఉత్తర్వులు జారీ చేస్తామని హైకోర్టు పేర్కొంది.
పోటీ పరీక్షల ప్రశ్నాపత్రాల కేసులో తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్ పీఎస్సీ) (TSPSC) కి ఊరట లభించింది. ప్రశ్నాపత్రాల లీకేజ్ (Question Papers Leakage) తో పోటీ పరీక్షలపై కమిషన్ తీసుకున్న నిర్ణయాన్ని తెలంగాణ హైకోర్టు (Telangana High Court) సమర్థించింది. పోటీ పరీక్షల రద్దు సబబేనని పేర్కొంది. పరీక్షలు వాయిదా వేయడం కూడా సరైన నిర్ణయమని అత్యున్నత న్యాయస్థానం తెలిపింది. ప్రశ్నాపత్రాల లీకేజ్ వ్యవహారంలో హైకోర్టులో విచారణ (Investigation) కొనసాగుతోంది.
ప్రశ్నాపత్రాల లీకేజ్ వ్యవహారంపై కాంగ్రెస్ యువజన నాయకుడు బల్మూరి వెంకట్ (Balmoori Venkat) ఉన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించాడు. ఈ పిటిషన్ పై సోమవారం విచారణ జరిగింది. లీకేజ్ అంశంపై ఏర్పాటుచేసిన సిట్ (SIT) సక్రమంగా దర్యాప్తు చేయడం లేదని పిటిషనర్ తరఫున న్యాయవాది న్యాయస్థానంలో వాదించారు. ‘సిట్ దర్యాప్తుపై రాజకీయ ఒత్తిడి, మంత్రి కేటీఆర్ (KT Rama Rao) జోక్యం ఉంది. మంత్రి ఆదేశాలకు అనుగుణంగా సిట్ దర్యాప్తు కొనసాగుతోంది. లీకేజీలో ఇద్దరికే ప్రమేయం ఉందని కేటీఆర్ ముందే చెప్పారు. ఐటీ అంశాలపై దర్యాప్తునకు సిట్ లో సాంకేతిక నిపుణులు లేరు’ అని పిటిషనర్ న్యాయవాది కోర్టులో వాదనలు వినిపించారు.
వాదనలు విన్న అనంతరం ఉన్నత న్యాయస్థానం స్పందిస్తూ.. ‘సిట్ లో ఐటీ నిపుణులు (IT Specialists) లేరా’ అని ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. ‘ఐటీ అంశాల దర్యాప్తునకు మళ్లీ ఔట్ సోర్సింగ్ (Out Sourcing)కు వెళ్తారా’ అని నిలదీసింది. బీజేపీ, కాంగ్రెస్ నేతలను ఎందుకు పిలిచారు? అని న్యాయస్థానం ప్రశ్నించింది. విచారణ చేసిన నాయకుల నుంచి ఏమైనా సమాచారం సేకరించారా? కోర్టు వివరాలు అడిగింది. ఈ వ్యవహారంపై ఈనెల 28వ తేదీన మధ్యంతర ఉత్తర్వులు జారీ చేస్తామని హైకోర్టు పేర్కొంది. అయితే ఈ వ్యవహారంలో కమిషన్ స్పందించిన తీరు సబబేనని ధర్మాసనం వ్యాఖ్యానించింది. పోటీ పరీక్షల రద్దు, వాయిదా సబబేనని సమర్ధించింది.