TS MLC Candidates: తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థులు వీరే
తెలంగాణ శాసనమండలి ఎన్నికల్లో పోటీ చేసేందుకు అద్దంకి దయాకర్, బల్మూరి వెంకట్ లను కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ ఎంపిక చేసింది. గత అసెంబ్లీ ఎన్నికల్లో తుంగతుర్తి ఎమ్మెల్యే టికెట్ ఆశించి భంగపడ్డారు అద్దంకి దయాకర్ .
TS MLC Candidates: తెలంగాణ శాసనమండలి ఎన్నికల్లో పోటీ చేసేందుకు అద్దంకి దయాకర్, బల్మూరి వెంకట్ లను కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ ఎంపిక చేసింది. గత అసెంబ్లీ ఎన్నికల్లో తుంగతుర్తి ఎమ్మెల్యే టికెట్ ఆశించి భంగపడ్డారు అద్దంకి దయాకర్ . దీంతో ఆయనను ఎమ్మెల్సీ పదవికి ఎంపిక చేసినట్లు సమాచారం. మరో స్థానానికి ఎన్ఎస్యూఐ రాష్ట్ర అధ్యక్షుడు బల్మూరి వెంకట్ పేరు ఖరారైంది. వెంకట్ గతంలో హుజూరాబాద్ నుంచి పోటీ చేశారు. గత ఎన్నికల్లో ఆయనకు టిక్కెట్ దక్కలేదు. టిక్కెట్ల కేటాయింపులో తనకు అన్యాయం జరిగిందని బల్మూరి వెంకట్ అప్పట్లో మండిపడ్డారు. ఈ నేపథ్యంలో అద్దంకి దయాకర్, బల్మూరి వెంకట్ల నామినేషన్‌కు సిద్ధం కావాలని పార్టీ హైకమాండ్ నుంచి ఫోన్లు వచ్చినట్లు సమాచారం. ఎమ్మెల్సీ నామినేషన్లకు ఈ నెల 18 వరకు గడువు ఉంది.
తెలంగాణలో ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు జనవరి 4న నోటిఫికేషన్ వెలువడగా.. రెండు ఉప ఎన్నికలు ఉన్నందున ఎన్నికల సంఘం వేర్వేరుగా నోటిఫికేషన్లు జారీ చేసింది. ఈ నెల 11 నుంచి 18 వరకు నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ ఉంటుంది. జనవరి 29న పోలింగ్.. అదే రోజు ఫలితాలు వెల్లడికానున్నాయి. జనవరి 19న నామినేషన్ల పరిశీలన.. నామినేషన్ల ఉపసంహరణకు 22వ తేదీ వరకు గడువు ఉంది. జనవరి 29న పోలింగ్ నిర్వహించి.. అదే రోజు సాయంత్రం 5 గంటలకు ఓట్ల లెక్కింపు నిర్వహించి ఫలితాలు వెల్లడిస్తారు. గతంలో ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీగా ఎన్నికైన కడియం శ్రీహరి, పాడి కౌశిక్ రెడ్డి ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఎమ్మెల్యేలుగా గెలుపొందారు. దీంతో వారు తమ ఎమ్మెల్సీ పదవులకు రాజీనామా చేశారు. ఈ నేపథ్యంలో రెండు స్థానాలకు ఎన్నికల సంఘం ఉప ఎన్నికలు నిర్వహిస్తోంది.