ప్రపంచంలోని అత్యంత సంపన్న నగరాల జాబితాలో (World’s Wealthiest Cities) హైదరాబాద్ 65వ స్థానంలో నిలిచింది (Hyderabad among World’s Wealthiest Cities). ఈ జాబితాలో న్యూయార్క్ మొదటి స్థానంలో నిలిచింది. ఈ నగరాన్ని బిగ్ యాపిల్ అని కూడా పిలుస్తారు (Big Apple wealthiest city on Earth). ఈ నగరంలో 340,000 మంది మిలియనీర్లు ఉన్నారు. టాప్ టెన్ విషయానికి వస్తే వరుసగా… న్యూయార్క్ సిటీ (340,000 మిలియనీర్లు), టోక్యో (290,300 మిలియనీర్లు), శాన్ ఫ్రాన్సిస్కో బే ఏరియా (285,000 మిలియనీర్లు), లండన్ (258,000 మిలియనీర్లు), సింగపూర్ (240,100 మిలియనీర్లు), లాస్ ఏంజిల్స్ (205,400 మిలియనీర్లు), హాంగ్ కాంగ్ (129,500 మిలియనీర్లు), బీజింగ్ (128,200 మిలియనీర్లు), షాంఘై (127,200 మిలియనీర్లు), సిడ్నీ (126,900 మిలియనీర్లు) ఉన్నాయి. యూఎస్ఏ నుండి మూడు, చైనా నుండి రెండు, జపాన్, యూకే, సింగపూర్, హాంగ్ కాంగ్, ఆస్ట్రేలియా దేశాల నుండి ఒక్కోటి చొప్పున నిలిచాయి. ఈ జాబితా 2022 డిసెంబర్ 31వ తేదీ నాటికి చెందినది. ప్రపంచంలోని అత్యంత సంపన్న నగరాల నివేదిక 2023ను మంగళవారం హెన్లీ అండ్ పార్ట్నర్స్ కంపెనీ విడుదల చేసింది. మొత్తం 97 నగరాలు చోటు దక్కించుకున్నాయి. అమెరికాలో అత్యధిక నగరాలు ఇందులో చోటు దక్కించుకున్నాయి.
ఇందులో హైదరాబాద్ (hyderabad) 65వ స్థానంలో నిలిచింది. హైదరాబాద్ లో 11,100 మంది మిలియనీర్లు ఉన్నారు. 2012 నుండి 2022 మధ్య హైదరాబాద్ లో అత్యధిక నికర సంపద కలిగిన వ్యక్తుల సంఖ్య 78 శాతం పెరిగింది. మొత్తంగా భారత్ నుండి కూడా చాలామంది మిలియనీర్లు ఉన్నారు. ఇందులో ముంబై 59,400 మిలియనీర్లతో 21వ స్థానంలో, ఢిల్లీ 30,200 59,400 మిలియనీర్లతో 36వ స్థానంలో, బెంగళూరు 12,600 మిలియనీర్లతో 60వ స్థానంలో, కోల్ కతా 12,100 మిలియనీర్లతో 63వ స్థానంలో, హైదరాబాద్ 11,100 మిలియనీర్లతో 65వ స్థానంలో నిలిచాయి. ఢిల్లీలో 16 మంది, బెంగళూరులో 8 మంది హైదరాబాద్ లో 5గురు, కోల్ కతాలో 7గురు బిలియనీర్లు ఉన్నారు. 2000 కాలంలో తొలి స్థానంలో ఉన్న లండన్ ఇప్పుడు నాలుగో స్థానానికి పడిపోయింది.