వైయస్ వివేకానంద రెడ్డి హత్య కేసు (ys vivekananda murder case) నుండి ఎంపీ వైయస్ అవినాశ్ రెడ్డి (ys avinash reddy), ఆయన తండ్రి భాస్కర రెడ్డిలను (ys bhaskar reddy) కాపాడేందుకు ముఖ్యమంత్రి జగన్ (cm jagan)… లాబీయిస్ట్ విజయ్ కుమార్ ను (vijay kumar) రంగంలోకి దింపారని టీడీపీ నేత వర్ల రామయ్య (tdp leader varla ramaiah) సంచలన ఆరోపణలు చేశారు. విజయ్ కుమార్ తో ఏం మాట్లాడారు.. ఏం పని అప్పగించారు… ఎవరిని మేనేజ్ చేయాలని కోరారు… నేను చెప్పింది అబద్దం కాదని చెప్పగలరా అని నిలదీశారు. తన ప్రశ్నలకు ప్రజల ముందు సమాధానం చెప్పాలని డిమాండ్ చేసారు. భాస్కర రెడ్డిని (bhaskar reddy) బయటకు తీసుకు రావడమనే బాధ్యతను విజయ్ కుమార్ కు జగన్ అప్పగించాడన్నారు. ఈ హత్య కేసుకు సంబంధించి సదరు లాబీయిస్ట్ ఏ క్షణంలో అయినా ఎవరినైనా కలువవచ్చునని అనుమానం వ్యక్తం చేశారు. విచారణ అధికారులను లేదా వారి పై అధికారులను కూడా కలిసే అవకాశం ఉందని చెప్పారు. విజయ్ కుమార్ వాస్తు శాస్త్రం, హస్తసాముద్రికంలో నిష్ణాతుడని, ఢిల్లీ, ఇతర రాష్ట్రాల పెద్దల పరిచయాలతో లాబీయింగ్ చేస్తుంటాడని, రాజీ కుదురుస్తారనే ప్రచారం ఉందన్నారు.
అలాంటి విజయ్ కుమార్ ఆదివారం ఉదయం మైసూరు విమానాశ్రయం నుండి ప్రత్యేక విమానంలో గన్నవరం చేరుకున్నాడని, వారు ఇక్కడకు వచ్చేసరికి వారి కోసం ప్రత్యేకంగా కారు, పోలీస్ పైలట్ వాహనం సిద్ధంగా ఉందని చెప్పారు. అతనితో పాటు ప్రముఖ కాంట్రాక్టర్ తనయుడు శశిధర్ తాడేపల్లి ప్యాలెస్ చేరుకున్నారని, మధ్యాహ్నం సీఎం ఇంటికి వెళ్లి, సాయంత్రం వరకు అక్కడే ఉన్నారని చెప్పారు. కారు నెంబర్ కనిపించకుండా జాగ్రత్తలు తీసుకున్నారని, ఆ తర్వాత తిరిగి గన్నవరం మీదుగా హైదరాబాద్ వెళ్లిపోయారన్నారు.
మైసూరు నుండి వచ్చిన వారు ఇక్కడ సీఎంను కలిసి హైదరాబాద్ వెళ్లడం, విజయ్ కుమార్, శశిధర్ సీఎంతో సమావేశమైనప్పుడు ఏ అధికారి, మంత్రి కూడా అక్కడ లేకపోవడం గురించి తెలియాల్సి ఉందన్నారు. భాస్కర రెడ్డి, అవినాశ్ రెడ్డి రిమాండ్ కు వెళ్లకుండా, ఒకవేళ వెళ్లినా బెయిల్ రప్పించే ప్రయత్నాలు చేస్తున్నారన్నాడు. జగన్ కు దేవుడిచ్చిన అన్నయ్య గాలి జనార్ధన్ రెడ్డి గతంలో సీబీఐ జడ్జికి లంచం ఇచ్చి పట్టుబడ్డారని, ఆ వ్యవహారంలో జడ్జి పట్టాభిరామారావు బలయ్యారని, ఇప్పుడు విజయ్ కుమార్ ద్వారా జగన్ ఎవరిని బలి చేయబోతున్నారో తెలియాలన్నారు. వివేకా హత్య కేసులో భాస్కర రెడ్డి, అవినాశ్ రెడ్డి ప్రధాన సూత్రదారులు అని, భాస్కర రెడ్డి రిమాండ్ కు వెళ్తారని సీఎంకు ముందే తెలుసు అన్నారు. సానుభూతి, రాజకీయ లబ్ధి కోసం జగన్ ఏమైనా చేస్తాడన్నారు.