వైయస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో (ys vivekananda murder case) అవసరమైతే కడప ఎంపీ వైయస్ అవినాశ్ రెడ్డి అరెస్ట్ తప్పదని సీబీఐ స్పష్టం చేసింది (kadapa mp ys avinash reddy arrest). దస్తగిరి వాంగ్మూలం ఆధారంగా మాత్రమే తాము ముందుకు వెళ్లడం లేదని, దర్యాఫ్తులో చాలా విషయాలు వెలుగు చూశాయని సోమవారం తెలంగాణ హైకోర్టుకు సీబీఐ తెలిపింది (cbi to court). సంఘటన స్థలంలో సాక్ష్యాలను చెరిపి వేయడంలో అవినాశ్ రెడ్డి కీలక (avinash reddy) పాత్ర పోషించారని, అలాగే, హత్యను గుండెపోటుగా ఆయనే తొలుత చెప్పారని దర్యాఫ్తులో తేలిందని పేర్కొన్నది. ఈ నెల 30వ తేదీ లోపు దర్యాఫ్తు పూర్తి చేయాలని సుప్రీం కోర్టు గడువు విధించిందని, విచారణకు నోటీసులు ఇస్తే అవినాశ్ రెడ్డి కోర్టులను ఆశ్రయించి దర్యాఫ్తును అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నాడని తెలిపింది. సాక్షిగా నోటీసులు ఇచ్చి విచారణకు పిలిచామని, అవసరమైతే అరెస్ట్ తప్పదని తెలిపింది. హత్య జరిగిన ఏడాది తర్వాత కేసు సీబీఐ చేతికి వచ్చిందని, దస్తగిరిని చిత్రహింసలకు గురి చేసి స్టేట్ మెంట్ ఇప్పించే అవకాశం, అవసరం దర్యాఫ్తు సంస్థకు లేదని స్పష్టం చేసింది.
అవినాశ్ రెడ్డి నిందితుడు.. అరెస్ట్ చేద్దామనుకున్నప్పుడు సాక్షిగా సీఆర్పీసీ 160 కింద నోటీసులు ఎలా ఇచ్చారని న్యాయమూర్తి ప్రశ్నించారు. అయితే క్రిమినల్ ప్రొసీజర్ ప్రకారం ఏడేళ్ల కంటే ఎక్కువ కాలం శిక్ష పడే కేసుల్లో 41ఏ నోటీసు ఇవ్వకుండా నేరుగా అరెస్ట్ చేయవచ్చునని సీబీఐ తరఫు లాయర్ తెలిపారు. అయినా ప్రస్తుతం ఉన్న వివరాల ప్రకారం సాక్షిగానే పిలిచామని, దర్యాఫ్తులో వెల్లడైన అంశాల ఆధారంగా మాత్రమే అవసరమైతే అరెస్ట్ చేస్తామని చెప్పింది.
రెండు రోజుల క్రితం అవినాశ్ రెడ్డి తండ్రి భాస్కర రెడ్డిని అరెస్ట్ చేశారు. అదే సమయంలో సోమవారం మధ్యాహ్నం అవినాశ్ రెడ్డిని సీబీఐ విచారణకు పిలిచింది. దీంతో ఆయన ముందస్తు బెయిల్ కోసం హైకోర్టును ఆశ్రయించారు. తనను సాక్షిగా పిలిచి, అరెస్ట్ చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయని, రాజకీయ కక్షతో ఇరికిస్తున్నారని పిటిషన్ లో పేర్కొన్నారు. భోజన విరామ సమయంలో ముందస్తు బెయిల్ పిటిషన్ పైన విచారణ జరిగింది. మంగళవారం సాయంత్రం విచారించాలని కోర్టు.. సీబీఐని ఆదేశించింది. ఈ నేపథ్యంలో మంగళవారం సాయంత్రం విచారణకు రావాలని సీబీఐ మళ్లీ నోటీసులు జారీ చేసింది.