ప్రధాని నరేంద్ర మోదీ తెలుగు రాష్ట్రాల పర్యటన ముగిసిన సంగతి తెలిసిందే. ఏపీ పర్యటనలో భాగంగా… మోదీ.. జనసేనాని పవన్ కళ్యాణ్ తో భేటీ అయ్యారు. మోదీతో భేటీ అనంతరం.. పవన్ తొలిసారిగా ఆయనపై ప్రశంసల వర్షం కురిపించారు. మోదీని ప్రశంసిస్తూ ట్విట్టర్లో వరుస పోస్టులు చేశారు.
మోదీతో భేటీ అయిన సమయంలో ఆయనతో దిగిన ఫోటోను షేర్ చేసిన పవన్ కల్యాణ్.. మోదీ చాలా గొప్ప వ్యక్తి అని చెప్పుకొచ్చారు. తాను ఎనిమిదేళ్ల తర్వాత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ మళ్లీ కలిశానని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పరిస్థితి, సమస్యలను వివరించడానికి విలువైన సమయాన్ని వెచ్చించినందుకు మోదీకి హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతున్నట్లు చెప్పారు.
ఈ సమావేశాన్ని సమన్వయం చేసినందుకు ప్రధానమంత్రి కార్యాలయానికి ధన్యవాదాలు తెలిపిన ఆయన ప్రతి కఠిన పరిస్థితినీ ఉక్కు సంకల్పంతో ఎదుర్కొనే నాయకత్వ పటిమ గల పురోగమనశీలి మోదీ అని పేర్కొన్నారు..
‘‘క్లిష్ట సమయంలో పాలన చేపట్టి- ప్రాంతీయవాదాలు, సాంస్కృతిక వైరుధ్యాలు.. అన్నింటినీ అర్థం చేసుకొని సమాదరించి ప్రతి ఒక్కరిలో భారతీయులం అనే భావన నింపారు.ప్రజారోగ్యానికి వాటిల్లిన విపత్తు, దేశ భద్రతకు పొంచి ఉన్న ముప్పు నుంచి రక్షణకు అహరహం తపించారు. ప్రతి కఠిన పరిస్థితినీ ఉక్కు సంకల్పంతో ఎదుర్కొనే నాయకత్వ పటిమగల పురోగమనశీలి ప్రధాని మోదీ. ‘ఎంత ఎత్తుకు ఎదుగుతాడో మనిషి ఈ కఠిన ధరిత్రి మీద.. అంత దీర్ఘంగా పడుతుంది చరిత్రలో అతని నీడ’- శేషేంద్ర చెప్పిన ఈ కవితా పంక్తులు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రస్థానానికి అద్దం పడతాయి’’ అని పవన్ కళ్యాణ్ వరుస ట్వీట్లు చేశారు.