స్వలింగ సంపర్కుల (Same Gender Marriages) వివాహాలను చట్టబద్ధం (Recognise) చేయాలనే డిమాండ్ కు భారత ప్రభుత్వం (Govt of India) మరోసారి వ్యతిరేకత (Opposed) తెలిపింది. స్వలింగ సంపర్క వివాహాలు వద్దు అని స్పష్టం చేసింది. వాటికి చట్టబద్ధత కల్పించడం అవనసరంగా పేర్కొంది. సుప్రీంకోర్టులో (Supreme Court of India) దాఖలైన పిటిషన్లపై సోమవారం మరోసారి కేంద్ర ప్రభుత్వం సమాధానం ఇచ్చింది. సుప్రీం అడిగిన దానికి కేంద్ర ప్రభుత్వం స్పందన తెలియజేసింది.
స్వలింగ సంపర్కుల వివాహాల చట్టబద్ధత కల్పించాలని సుప్రీంకోర్టులో పలు పిటిషన్లు దాఖలయ్యాయి. దీనిపై విచారణ చేపట్టిన అత్యున్నత న్యాయస్థానం కేంద్ర ప్రభుత్వ స్పందనను తెలుసుకుంది. గతంలో కేంద్రం వీటికి సమ్మతించం అని సమాధానం ఇచ్చింది. తాజాగా మరోసారి సుప్రీంకోర్టులో కేంద్రం తన అభిప్రాయాన్ని తెలిపింది. కొందరు నాగరికులమని భావించే వారు తమ అభిప్రాయాలను సమాజంపై రుద్దేందుకు ఈ పిటిషన్లు వేశారని కేంద్రం పేర్కొంది. ఇలాంటి బంధాలను ప్రస్తుత భారతదేశ వివాహ వ్యవస్థతో సమానంగా పరిగణిస్తే అది ప్రతి పౌరుడిపై తీవ్ర ప్రభావం చూపిస్తుందని కేంద్రం అభిప్రాయపడింది. వివాహాలను గుర్తించడం పూర్తిగా చట్టపరమైన అంశమని.. దీనికి న్యాయస్థానాలు దూరంగా ఉండాలని కేంద్ర ప్రభుత్వం కోరింది.
‘గ్రామీణ, పట్టణ జనాభా విస్తృత అభిప్రాయాలు, వారి వ్యక్తిగత చట్టాలు, వివాహ వ్యవస్థను నియంత్రించే ఆచారాలను దృష్టిలో ఉంచుకుని మతపరమైన అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకుని పార్లమెంట్ చట్టాలు చేస్తుంది. వివాహం అనేది సామాజిక చట్టపరమైన సంస్థ, రాజ్యాంగంలో 246 ప్రకరణ ప్రకారం పార్లమెంట్ ద్వారా మాత్రమే ఇది గుర్తించబడుతుంది. చట్టపరమైన గుర్తింపు ఇస్తుంది. వివాహ చట్టాల్లో వివాహం అనేది కేవలం పురుషుడు, స్త్రీ మధ్య జరిగే ప్రక్రియ మాత్రమే. హక్కులను సృష్టించడం, బంధాలను గుర్తించడం, చట్టబద్ధమైన పవిత్రతను ఇవ్వడం చట్టసభల ద్వారానే సాధ్యం అవుతుంది. న్యాయ వ్యవస్థతో ఆ పని కాదు’ అని సుప్రీంకోర్టుకు కేంద్ర ప్రభుత్వం తన అభిప్రాయాన్ని తెలిపింది.
కొన్ని దేశాల్లో స్వలింగ సంపర్కుల వివాహాలకు చట్టబద్ధత కల్పించారు. భారతదేశంలో కూడా ఆ వివాహాలకు చట్టబద్ధత కల్పించాలంటూ పిటిషన్లు దాఖలయ్యాయి. దాఖలైన ఈ పిటిషన్లపై మంగళవారం ప్రధాన న్యాయమూర్తి డీవై చంద్రచూడ్ (DY Chandra Chood), న్యాయమూర్తులు ఎస్ కే కౌల్, ఎస్ రవీంద్ర భట్, పీఎస్ నరసింహా, హిమా కోహ్లీతో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టనుంది. కేంద్ర ప్రభుత్వం స్పష్టమైన సమాధానం ఇవ్వడంతో అత్యున్నత న్యాయస్థానం దాఖలైన పిటిషన్లు కొట్టి వేసే అవకాశం ఉంది.