సమాజ్ వాది పార్టీ సీనియర్ నేత అజం ఖాన్ (Samajwadi Party leader Azam Khan) ఆరోగ్యం హఠాత్తుగా క్షీణించడంతో ఢిల్లీలోని గంగారామ్ ఆసుపత్రికి తరలించారు (admitted to Sir Gangaram Hospital in Delhi). ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగానే ఉంది. అబ్జర్వేషన్ లో ఉన్నారు. హఠాత్తుగా ఆరోగ్యం క్షీణించిందని, దీంతో సోమవారం వేకువజామున 3 గంటలకు ఆసుపత్రిలో చేరారని వైద్యులు తెలిపారు. గత ఏడాది మే నెలలోను 72 ఏళ్ళ అజమ్ ఖాన్ ఇదే ఢిల్లీ ఆసుపత్రిలో రొటీన్ చెక్-అప్ కోసం చేరారు. అజం ఖాన్ రాంపూర్ సదర్ నుండి ఎమ్మెల్యేగా గెలిచారు. అయితే విద్వేష ప్రసంగం చేసినందుకు కోర్టు ఆయనకు మూడేళ్ల జైలు శిక్ష విధించింది. అలాగే కోర్టు రూ.25000 జరిమానా కూడా విధించింది. ఆ తర్వాత రాష్ట్ర అసెంబ్లీ సచివాలయం అక్టోబర్ మొదట్లో ఆయనపై అనర్హత వేటు వేసింది.
రామ్పూర్లోని పాలక అధికారులు, ప్రధాని నరేంద్ర మోడీ, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్య నాథ్‌లపై ఎన్నికల సమావేశాల్లో తీవ్ర ఆరోపణలు చేశారంటూ ఆజం ఖాన్‌పై 2019 ఏప్రిల్‌లో కేసు నమోదయింది. 2019 లోకసభ ఎన్నికల సందర్భంగా మిలక్ కొత్వాలి ప్రాంతంలోని ఖతనగరియా గ్రామంలో ఓ బహిరంగ సమావేశంలో రెచ్చగొట్టే ప్రసంగం చేసినందుకు కేసు బుక్ అయింది. 20 మే 2022లో అతను సీతాపూర్ జైలు నుండి విడుదలయ్యారు. అదే రోజు చీటింగ్ కేసులో అతనికి సుప్రీం కోర్టు మధ్యంతర బెయిల్ ఇచ్చింది. వక్ఫ్ బోర్డు భూమిని అనధికారికంగా కలిగి ఉన్న కేసులో ఆజం ఖాన్‌కు అలహాబాద్ హైకోర్టు 2022 మేలో తాత్కాలిక బెయిల్ ఇచ్చింది.