జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై వైసీపీ నేత సజ్జల రామకృష్ణా రెడ్డి విమర్శల వర్షం కురిపించాడు. అసలు ఇప్పటం గ్రామంలో ఎవరికీ ఎలాంటి నష్టం జరగలేదని… పవన్ ఎందుకు అంత ఓవర్ గా రియాక్ట్ అయ్యాడో అర్థం కాలేదని సజ్జల పేర్కొనడం విశేషం.
సభకు స్థలం ఇచ్చిన ఒక్కరి ఇల్లు కూడా పోలేదని, ప్రభావం పడే అవకాశం ఉన్న ఒక వ్యక్తి కూడా కోర్టుకు వెళ్ళి స్టే తెచ్చుకున్నాడని గుర్తుచేశారు. దీనికి పవన్ కళ్యాణ్ చేసిన డ్రామా అందరూ చూశారని, ఏమీ లేని విషయాన్ని ఒక సినిమా కథలా తయారు చేసి ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేశారని సజ్జల విమర్శించారు. ఇదంతా కుట్రపూరితంగా చేశారని సజ్జల అన్నారు. నిజంగా అధికారంలోకి రావాలి అనుకునే రాజకీయ పార్టీలు ఇలా చేస్తాయా? అంటూ ప్రశ్నించారు.
2019లోనూ ఇలానే ప్రజలను రాజధాని పేరుతో గ్రాఫిక్స్ చూపించారని, చంద్రబాబు చేయలేని అభివృద్ధిని మూడేళ్లలోనే ముఖ్యమంత్రి జగన్ చేశారని సజ్జల ప్రశంసించారు. అందుకే చంద్రబాబుకు, ఆయనకు మద్దతు ఇస్తున్న మీడియా సంస్థలకు కడుపు మంట అని అన్నారు. ప్రజలతో కనెక్టివిటీ లేకుండా కేవలం ట్విట్టర్ స్పందనల వల్ల ప్రయోజనం ఉండదని చంద్రబాబుకు ఎందుకు అర్థం కావటం లేదో తెలియడం లేదని సజ్జల అన్నారు.
2014లో చంద్రబాబు ఇచ్చిన హామీలను ఎందుకు నెరవేర్చలేదని సజ్జల ప్రశ్నించారు. 2014 ఎన్నికల్లో చంద్రబాబుతో కలిసే పవన్ కళ్యాణ్ ప్రచారం చేశారని, అర్హులైన అందరికీ మూడు సెంట్ల స్థలం, పక్కా గృహాలు ఇస్తామని హామీ ఇచ్చారని గుర్తుచేశారు. ఎన్నికల హామీలో కనీసం ఒక్క సెంటు భూమి అయినా ఇచ్చారా? పవన్ కళ్యాణ్ ఎప్పుడైనా ఈ విషయం పై ప్రశ్నించారా? అంటూ సజ్జల నిలదీశారు. అప్పుడు టీడీపీ, జనసేన, బీజేపీ కలిసే కదా పోటీ చేసింది, ఇది ప్రజలను మోసం చేయటం కాదా? అంటూ సజ్జల నిలదీశారు.
చంద్రబాబును మళ్ళీ అధికారంలోకి తీసుకురావడానికి వీరంతా పన్నుతున్న కుట్రలను ప్రజలు గమనించాలని సజ్జల కోరారు. గమనించటమే కాదు వీళ్ళ మోసాలను ప్రజలు ప్రశ్నించాలని సూచించారు.