ప్రధాని నరేంద్ర మోడీ పైన కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీ మంగళవారం నిప్పులు చెరిగారు (Sonia Gandhi Attacks PM Narendra Modi). క్రమంగా ప్రజాస్వామ్యాన్ని అంతమొందిస్తున్నారని చెప్పారు. సోనియా (Sonia Gandhi) ఆరోపణలను బీజేపీ (BJP) కూడా అంతేస్థాయిలో తిప్పికొట్టింది. ప్రజాస్వామ్యం ఈ దేశంలో ఒక్కసారి 1975లో మాత్రమే చచ్చిపోయిందని కేంద్రమంత్రి కిరణ్ రిజిజు కౌంటర్ ఇచ్చారు (Law minister Kiran Rijiju). మంగళవారం ఓ జాతీయ మీడియాకు రాసిన వ్యాసంలో ఆమె మోడీ సర్కార్ పైన (Modi Government) విమర్శలు గుప్పించారు. ప్రధాని తన అధికారాలను దుర్వినియోగం చేస్తున్నారని, బీజేపీ నేతల అండతో దేశంలో విద్వేషాలు, హింస పెరుగుతున్నాయన్నారు. వీటిని ప్రధాని పట్టించుకోవడం లేదన్నారు. మతపరమైన పండుగలకు బెదిరింపులకు పాల్పడుతున్నారని, ప్రజల ఆనందానికి బదులు మతం, ఆహారం, కులం, లింగం, భాష పేరుతో వివక్షకు గురవుతున్నారన్నారు. ప్రభుత్వం తీరు ప్రజాస్వామ్యానికి మూలస్థంభాలైన శాసన, కార్య నిర్వాహక, న్యాయ వ్యవస్థలను నిర్వీర్యం చేస్తోందన్నారు.
ప్రతి పక్షాల పైన ప్రధాని నేరుగా తన అధికారాన్ని ప్రదర్శించకపోయినప్పటికీ ప్రభుత్వం తీసుకునే చర్యలు విపక్షాలపై పాల్పడుతున్న దౌర్యన్యాలను ప్రతిబింబిస్తున్నాయన్నారు. సీబీఐ, ఈడీలను విపక్షాల పైకి ఉసిగొల్పుతున్నట్లు ఆరోపించారు. ప్రతిపక్షాలకు వ్యతిరేకంగా 95 శాతం కేసులు నమోదయ్యాయని, కానీ బీజేపీలో చేరే వారిపై మాత్రం కేసులు ఆవిరైపోతున్నాయన్నారు. పార్లమెంటులో ప్రసంగాలను బహిష్కరించి, చర్చలను అడ్డుకొని, చివరకు ఒక కాంగ్రెస్ ఎంపీని మెరుపు వేగంతో అనర్హుడిగా ప్రకటించారని రాహుల్ గాంధీ అనర్హత అంశాన్ని పరోక్షంగా ప్రస్తావించారు. చైనా చొరబాటు యత్నాలపై పార్లమెంటులో చర్చ జరగనీయడం లేదన్నారు. వచ్చే ఎన్నికల్లో తాము భావసారూప్య పార్టీలతో కలిసి ముందుకు సాగుతామన్నారు. రానున్న కొద్ది నెలలు భారత ప్రజాస్వామ్యానికి చాలా కీలకమన్నారు. వివిధ రాష్ట్రాల్లో ఎన్నికలు సమీపిస్తున్నాయన్నారు.
బీజేపీ గట్టి కౌంటర్
సోనియా వ్యాఖ్యల పైన కేంద్రమంత్రులు ధర్మేంద్ర ప్రధాన్ (Dharmendra Pradhan), కిరణ్ రిజిజు (Kiran Rijiju) గట్టి కౌంటర్ ఇచ్చారు. ప్రజాస్వామ్యం, న్యాయవ్యవస్థ గురించి కాంగ్రెస్ మాట్లాడటం విడ్డూరంగా ఉందని కిరణ్ రిజిజు అన్నారు. స్వతంత్ర భారతంలో ప్రజాస్వామ్యం 1975లో ఒక్కసారి మాత్రమే చనిపోయిందని ఇందిరా గాంధీ పాలనలోని ఎమర్జెన్సీని ఉద్దేశించి అన్నారు. ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాన్ని ప్రశ్నించడంలో తప్పు లేదని, కానీ దేశాన్నే ప్రశ్నించడం సరికాదన్నారు. తాము దేశం కంటే ఎక్కువ అని కొన్ని కుటుంబాలు భావిస్తున్నాయని ఎద్దేవా చేశారు. మోడీపై వ్యతిరేకత, ద్వేషాన్ని ఈ కథనం ద్వారా చెప్పారని ధర్మేంద్ర ప్రధాన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ నాయకత్వం ఒక కుటుంబం భ్రమ నుండి బయటపడి వాస్తవికతను గుర్తించాలన్నారు. భారత ప్రజాస్వామ్యం ఇప్పుడే వర్దిల్లుతోందని, ప్రధాని మోడీ ఏమిటో ప్రజలకు తెలుసునని.. వారు ఆయనను ఆశీర్వదిస్తారన్నారు.