తెలంగాణ సీఎం కుమార్తె, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు భారీ ఊరట కలిగింది. ఇటీవల ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో ఆమె ఆరోపణలు ఎదుర్కొన్న సంగతి తెలిసిందే. కాగా.. ఈ కేసుకు సంబంధించి తాజాగా ఆమెకు సిటీ సివిల్ కోర్టు ఊరట నిచ్చింది.
లిక్కర్ స్కామ్లో తన ప్రమేయం ఉందంటూ ఆరోపణలు చేసిన బీజేపీ నేతలపై ఎమ్మెల్సీ కవిత పరువునష్టం దావా వేసిన సంగతి తెలిసిందే. తనపై ఉద్దేశ పూర్వకంగా తప్పుడు ఆరోపణలు చేసి ప్రతిష్టకు భంగం కలిగించారని పిటిషన్లో పేర్కొన్నారు. అయితే కవిత పిటిషన్పై విచారణ జరిపిన సిటీ సివిల్ కోర్టు బుధవారం మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది.
ఢిల్లీ లిక్కర్ కేసులో కల్వకుంట్ల కవితపై ఎవరూ ఎలాంటి వ్యాఖ్యలు చేయకూడదని సిటీ సివిల్ కోర్టు ఆదేశించింది. ఈ నేపథ్యంలోనే బీజేపీ ఎంపీ పర్వేష్ వర్మ, మాజీ ఎమ్మెల్యే మజిందర్ సిర్సాలకు నోటీసులు పంపించింది. ఈ వ్యవహారానికి సంబంధించి మీడియాలో గానీ, సోషల్ మీడియాలో గానీ కవితపై ఎలాంటి వ్యాఖ్యలు చేయవద్దని ఆదేశించింది. ఈ పిటిషన్పై తదుపరి విచారణను సెప్టెంబర్ 13కు కోర్టు వాయిదా వేసింది.