జూనియర్ ఎన్టీఆర్ రాజకీయాల్లోకి అడుగుపెట్టాలంటూ గతంలో అభిమానులు విపరీతంగా కోరుకునేవారు. టీడీపీ మీటింగ్స్ ఎక్కడ జరిగినా.. అక్కడ ఎన్టీఆర్ పేరు వినపడేది. సీఎం , సీఎం అంటూ నినాదాలు కూడా చేసేవారు. కానీ.. ఆయన అవేమీ పట్టించుకోకుండా పాన్ ఇండియా స్టార్ గా ఎదుగుతూ వెళ్తున్నారు. ఈ క్రమంలో.. ఆర్ఆర్ఆర్ సినిమా తర్వాత ఆయన క్రేజ్ మరింత పెరిగింది. అందులో ఆయన నటన చూసి ఇంప్రెస్ అయిన కేంద్ర మంత్రి అమిత్ షా ఆయనను కలిశారు. ఈ క్రమంలో మరోసారి ఎన్టీఆర్ పేరు రాజకీయంగా మళ్లీ హాట్ టాపిక్ గా మారింది. ఈ క్రమంలో.. లక్ష్మీ పార్వతి చేసిన కామెంట్స్ ఇప్పుడు వైరల్ గా మారాయి.
జూనియర్ ఎన్టీఆర్ రాజకీయాల్లోకి రావాలని ఆంధ్రప్రదేశ్ తెలుగు, సంస్కృత అకాడమీ చైర్పర్సన్ లక్ష్మీపార్వతి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆయన రాజకీయాల్లోకి రావాలని కోరుకునేవారిలో తానుకూడా ఉన్నానని తెలిపారు. జూనియర్ ఎన్టీఆర్ తొందర్లోనే రాజకీయాల్లోకి వచ్చి.. టీడీపీని తీసుకోవాలని కోరుకుంటున్నట్టుగా చెప్పారు. ఆ అబ్బాయికి తన ఆశీస్సులు అని తెలిపారు.
ఇదిలా ఉంటే.. ఓ ఇంటర్య్యూలో తెలంగాణ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు చేసిన తనపై చేసిన వ్యాఖ్యలపై ఇటీవల లక్ష్మీపార్వతి స్పందించారు. ఎర్రబెల్లి దయాకర్ రావు చేసిన వ్యాఖ్యల్లో ఎలాంటి నిజమూ లేదని చెప్పారు. ఆయన ఇంకా టీడీపీ ముసుగును తొలగించుకోలేకపోతున్నారని విమర్శించారు. దయాకర్ రావు వ్యాఖ్యలు విడ్డూరంగా ఉన్నాయని తెలిపారు. వైశ్రాయ్ హోటల్ లో జరిగిన ఘటనలో దయాకర్ రావు కీలక పాత్ర పోషించారని ఆరోపించారు. మరి ఎందుకు ఆ సమయంలో ఆయనకు మంత్రి పదవి దక్కలేదని అన్నారు. అప్పుడు కూడా చంద్రబాబు భార్య నగలు, వజ్రాలు వంటివి అడిగారా అని ప్రశ్నించారు. అసత్య ప్రచారాలు చేయడం తగదని దుయ్యబట్టారు.
నమ్మకద్రోహులు, ఎన్టీఆర్ మృతికి కారణమైన వారంతా మళ్లీ ఒక్కటి అవుతున్నారని ఈ విషయంలో సీఎం కేసీఆర్ కొంచెం అలెర్ట్ గా ఉండాలని చెప్పారు. నందమూరి తారక రామారావు సీఎంగా ఎన్నికైన ఎనిమిది నెలల సమయంలోనే తనను కారణంగా చూపిస్తూ, చంద్రబాబును ముఖ్యమంత్రిగా చేయాలని పలువురు మీడియా వ్యక్తులు (రామోజీరావు, రాధాకృష్ణ) చేసిన ప్రయత్నాలను ఆయన (ఎన్టీఆర్) సమాజానికి చెప్పారని అన్నారు. రాధాకృష్ణ ఓ హోటల్ లో మీడియా వ్యక్తులకు నగదు అందజేసి.. తనకు, నందమూరి తారక రామారావుకు యాంటీగా, చంద్రబాబు నాయుడికి సపోర్ట్ గా న్యూస్ రాయించారని ఆమె ఆరోపించారు.