»Delhi Excise Policy Case Kavitha Press Conference On Thursday At 1 Pm
Delhi excise policy case: మధ్యాహ్నం మీడియా ముందుకు కవిత
BRS MLC కవిత మధ్యాహ్నం మీడియా ముందుకు రానున్నారు. తనకు ఈడీ నోటీసులు, విచారణ, మహిళలకు రిజర్వేషన్లు, భారత జాగృతి నిరసనలపై ఆమె మాట్లాడనున్నారు. ఈ మీడియా సమావేశం ఢిల్లీలోని బీఆర్ఎస్ పార్టీ పార్లమెంటు సభ్యులు (BRS MP) కొత్త ప్రభాకర్ రెడ్డి నివాసంలో ఉండనుంది.
సంచలనం సృష్టించిన మద్యం కుంభకోణం కేసులో (delhi liquor scam case) భారత రాష్ట్ర సమితి నాయకురాలు (BRS leader), ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు (mlc kalvakuntla kavitha) దర్యాఫ్తు సంస్థ ఈడీ (ED) నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే. అయితే ముందస్తు కార్యక్రమాల నేపథ్యంలో తాను 9, 10వ తేదీల్లో రాలేనని, 11వ తేదీన విచారణకు హాజరవుతానని ఆమె దర్యాఫ్తు సంస్థకు లేఖ రాశారు. ఈ లేఖపై నిన్నటి వరకు ఈడీ నుండి సమాధానం రాలేదు. కానీ ఆ తర్వాత కవిత విజ్ఞప్తికి ఓకే చెప్పింది. కవిత లేఖపై స్పందించిన విచారణాధికార సంస్థ ప్రతినిధులు.. 11వ తేదీ ఉదయం ఢిల్లీలోని ఈడీ కార్యాలయంలో విచారణకు హాజరు కావాలని సూచించారు. తనకు ఈడీ నోటీసుల (enforcement directorate Notice) నేపథ్యంలో ఆమె మధ్యాహ్నం ఒకటి గంటలకు మీడియా ముందుకు రానున్నారు. మహిళలకు 33 శాతం రిజర్వేషన్లను డిమాండ్ చేస్తూ రేపు జంతర్ మంతర్ వద్ద కవిత ధర్నాను సంకల్పించిన విషయం తెలిసిందే. తెలంగాణలో తన తండ్రి పాలనలో మహిళలకు న్యాయం చేయలేని, మహిళలకు మంత్రి పదవులు ఇవ్వలేని కేసీఆర్ ను ప్రశ్నించకుండా రిజర్వేషన్ల డిమాండ్… మద్యం కుంభకోణం కేసు నుండి దృష్టి మరల్చేందుకేననేది విపక్షాల వాదన.
ఢిల్లీ మద్యం స్కాం (delhi liquor scam case) కేసులో ఢిల్లీ మాజీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా (Manish Sisodia), కవితకు సన్నిహితులు రామచంద్ర పిళ్లై (arun ramachandran pillai) వంటి వారిని ఈడీ అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈమెను కూడా ఈడీ అదుపులోకి తీసుకుంటుందా అనే చర్చ సాగుతోంది. ఇలాంటి సమయంలో ఆమె మధ్యాహ్నం మీడియా ముందుకు రానున్నారు. తనకు ఈడీ నోటీసులు, విచారణ, మహిళలకు రిజర్వేషన్లు, భారత జాగృతి నిరసనలపై ఆమె మాట్లాడనున్నారు. ఈ మీడియా సమావేశం ఢిల్లీలోని బీఆర్ఎస్ పార్టీ పార్లమెంటు సభ్యులు (BRS MP) కొత్త ప్రభాకర్ రెడ్డి నివాసంలో (mp kotha prabhakar reddy) ఉండనుంది.
ఈ నెల 13వ తేదీన కవిత పుట్టిన రోజు (MLC Kavitha Birth Day) ఉన్నది. ఈ నేపథ్యంలో తొలుత ఆమె మరింత గడువు కోరినట్లుగా తెలుస్తోంది. కానీ ఈడీ నో చెప్పడంతో 11న విచారణకు హాజరయ్యేందుకు సిద్ధమైనట్లుగా సమాచారం. అసలు తనను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రశ్నించే అవకాశం ఉన్నప్పటికీ ప్రత్యక్ష విచారణ కోసం ఢిల్లీకి పిలవడం వెనుక ఆంతర్యం ఏమిటని ఆమె తన సన్నిహితుల వద్ద చెబుతున్నారట. మహిళను ఆమె నివాసంలోనే ప్రశ్నించవచ్చునని గతంలో కోర్టు ఇచ్చిన తీర్పును గుర్తు చేస్తున్నారట. ఇంత స్వల్పకాలంలో తనను విచారణకు పిలవడం కూడా సరికాదని, ఇది కక్ష సాధింపుగా కనిపిస్తోందని ఆమె చెబుతున్నారట. మరోవైపు, కవిత అరెస్టుపై ఊహాగానాల నేపథ్యంలో బీఆర్ఎస్ లీగల్ సెల్ ఇప్పటికే ముందస్తు బెయిల్ ప్రయత్నాలు చేస్తోంది.