తెలంగాణ రాజకీయాలను మరింత ఆసక్తికరంగా చేసింది మునుగోడు ఉప ఎన్నిక. ఈ మునుగోడు ఉప ఎన్నికను అన్ని ప్రధాన పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. ఈ ఎన్నికల్లో ఎలాగైనా విజయం సాధించాలని అన్ని పార్టీలు ప్రయత్నాలు చేస్తున్నాయి. తెలంగాణలో వచ్చే ఏడాది జరగనున్న అసెంబ్లీ ఎన్నికల ముందు జరిగే సెమీస్ గా ఈ ఎన్నికను భావిస్తున్నారు.
కాంగ్రెస్ ఎమ్మెల్యేగా ఉన్న కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రాజీనామాతో మునుగోడులో ఉప ఎన్నిక తప్పలేదు. రాజగోపాల్ రెడ్డి ఎమ్మెల్యే పదవితో పాటుగా కాంగ్రెస్ కు రాజీనామా చేసి బీజేపీలో చేరారు. మునుగోడు నుంచి బీజేపీ అభ్యర్దిగా రాజగోపాల్ రెడ్డి బరిలో నిలిచారు. ఈ రోజు షెడ్యూల్ విడుదల చేసిన ఎన్నికల సంఘం ఈ నెల 7వ తేదీన ఉప ఎన్నిక నోటిఫికేషన్ జారీ చేయనుంది.
నామినేషన్ల సమర్పణకు ఈనెల 14వరకు గడువుగా ప్రకటించారు. 15న నామినేషన్ల పరిశీలన ఉంటుంది. 17వ తేదీ వరకు నామినేషన్ల ఉప సంహరణకు గడువుగా ఎన్నికల సంఘం నిర్ణయించింది. నవంబర్ 3న పోలింగ్ జరగనుంది. నవంబర్ 6న ఉపఎన్నిక ఓట్ల లెక్కింపు ఉంటుందని ఎన్నికల సంఘం ప్రకటించింది. అటు కాంగ్రెస్ నుంచి పాల్వాయి స్రవంతిని పార్టీ తమ అభ్యర్ధి గా బరిలోకి దించింది.
టీఆర్ఎస్ తమ అభ్యర్ధిని అధికారికంగా ప్రకటించలేదు. జగదీశ్వర్ రెడ్డి పార్టీ అభ్యర్ధిగా బరిలో నిలిచే అవకాశం ఉంది. టీఆర్ఎస్ ను జాతీయ పార్టీగా మార్చే ప్రక్రియలో నిమగ్నం అయిన సీఎం కేసీఆర్, ఇప్పుడు ఉప ఎన్నిక షెడ్యూల్ రావటంతో అభ్యర్ధిని అధికారికంగా ప్రకటించనున్నారు. ఇప్పుడు..మునుగోడు కేంద్రంగా తెలంగాణ రాజకీయం మరింత ఆసక్తి కరంగా మారనుంది.