మెగాస్టార్ చిరంజీవి మరో ప్రాజెక్ట్‌ను లైన్లో పెట్టారా.. అంటే ఔననే అంటున్నాయి ఇండస్ట్రీ వర్గాలు. ఈ దసరాకు చిరు లేటెస్ట్ ఫిల్మ్ ‘గాడ్ ఫాదర్’ ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సంగతి తెలిసిందే. ఇక ఈ సినిమాతో పాటు మరో రెండు ప్రాజెక్ట్స్ కూడా గతంలోనే మొదలు పెట్టాడు చిరంజీవి. బాబీ దర్శకత్వంలో ‘వాల్తేర్ వీరయ్య’, మెహర్ రమేష్ దర్శకత్వంలో ‘భోళా శంకర్’ సినిమాలు చేస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమాలు సెట్స్ పై ఉన్నాయి. వీటితో పాటు యంగ్ డైరెక్టర్ వెంకీ కుడుములతోను ఓ సినిమా అనౌన్స్ చేశారు. ఇవన్నీ ఉండగానే ఇప్పుడు ప్రభుదేవా దర్శకత్వంలో ఓ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని తెలుస్తోంది. గతంలో తెలుగులో నువ్వొస్తానంటే నేనొద్దంటానా, పౌర్ణమి సినిమాలను డైరెక్ట్ చేశాడు ప్రభుదేవా. ఇక తెలుగు హిట్ మూవీస్ ‘పోకిరి’, విక్రమార్కుడు సినిమాలను హిందీలో రీమేక్ చేశాడు. దాంతో ప్రభుదేవాకు రీమేక్ స్పెషలిస్ట్ అనే చెప్పొచ్చు. పైగా గతంలో చిరుతో ‘శంకర్ దాదా జిందాబాద్’ అనే సినిమాను రీమేక్ చేశాడు. ఇక ఇప్పుడు కూడా మెగాస్టార్‌తో మరో రీమేక్ చేయబోతున్నట్టు తెలుస్తోంది. ఇటీవల నెట్ ఫ్లిక్స్‌లో ఓ స్పానిష్ సినిమాను చూశారట చిరు. అది ఆయనకి బాగా నచ్చిందట. దాంతో ఆ సినిమాను తెలుగులో రీమేక్ చేసే ఆలోచనలో ఉన్నారట. ఆ బాధ్యతలను ప్రభుదేవాకి ఇచ్చినట్లు సమాచారం. ఇదిలా ఉంటే.. గాడ్ ఫాదర్లో థార్ మార్ పాటకు కొరియోగ్రఫీ చేశాడు ప్రభుదేవా. అందుకే చిరుతో మళ్లీ లైన్లోకి వచ్చాడని చెప్పొచ్చు.