»Visakha Will Be The Capital Of Andhra Pradesh Gudivada
AP capital issue: మళ్లీ.. విశాఖనే అంటున్న మంత్రి గుడివాడ!
ఆంధ్రప్రదేశ్ రాజధానిపై (Andhra Pradesh Capital) మంత్రి గుడివాడ అమర్నాథ్ (gudivada amarnath) మరోసారి అవే వ్యాఖ్యలు చేశారు. ఏపీకి విశాఖ కొత్త రాజధాని కాబోతుందని, త్వరలో ఇక్కడి నుండి పాలన ఉంటుందని వ్యాఖ్యానించారు. రాజధానికి కావాల్సిన అర్హతలు విశాఖకు ఉన్నాయని అభిప్రాయపడ్డారు. అదే సమయంలో మూడు ప్రాంతాలకు సమాన ప్రాధాన్యత ఇవ్వాలనేది తమ ఉద్దేశ్యమని చెప్పారు.
ఆంధ్రప్రదేశ్ రాజధానిపై (Andhra Pradesh Capital) మంత్రి గుడివాడ అమర్నాథ్ (gudivada amarnath) మరోసారి అవే వ్యాఖ్యలు చేశారు. గురువారం విశాఖలో (Visakha) రాష్ట్ర ప్రభుత్వం, పల్సస్ గ్రూప్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న గ్లోబల్ టెక్ సమ్మిట్ 2023ను ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడారు. ఏపీకి విశాఖ కొత్త రాజధాని కాబోతుందని, త్వరలో ఇక్కడి నుండి పాలన ఉంటుందని వ్యాఖ్యానించారు. రాజధానికి కావాల్సిన అర్హతలు విశాఖకు ఉన్నాయని అభిప్రాయపడ్డారు. అదే సమయంలో మూడు ప్రాంతాలకు సమాన ప్రాధాన్యత ఇవ్వాలనేది తమ ఉద్దేశ్యమని చెప్పారు. అయితే కొందరు ఈ అంశంపై కోడిగుడ్డు మీద ఈకలు పీకుతున్నారన్నారు. రాజధాని అంశం చూసే కోణాన్ని బట్టి ఉంటుందన్నారు. రాజధాని పేరుతో విద్వేషాలు సరికాదన్నారు. ముఖ్యమంత్రి జగన్ (YS Jagan) తన పరిపాలన వ్యవస్థను విశాఖకు మార్చాలని నిర్ణయించారని, రాబోయే కొద్ది రోజుల్లో అది పూర్తవుతుందని చెప్పారు. విశాఖ ఇప్పటికే ఎంతో అభివృద్ధి చెందిందని, అన్ని వసతులు ఉన్నాయని గుర్తు చేశారు. పెద్దగా ఖర్చు పెట్టి కొత్తగా ఎంతో చేయాల్సిన అవసరం లేదన్నారు.
మూడు ఐటీ నగరాలు
ఏపీలో మూడింటిని ఐటీ నగరాలుగా తీర్చిదిద్దుతామని చెప్పారు. విశాఖతో పాటు అనంతపురం (Anantapur), తిరుపతిలలో (Tirupati) ఐటీని పట్టాలెక్కిస్తామన్నారు. ఈ ప్రాంతాల్లో ఇప్పటికే ఐటీ పార్కులు ఉన్నాయని గుర్తు చేశారు. విశాఖలో అదానీ డేటా సెంటర్ రానుందని, మార్చిలో సీఎం చేతుల మీదుగా ప్రారంభించనున్నట్లు చెప్పారు. బోగాపురం విమానాశ్రయం (Bhogapuram) సమీపంలోకి మరో కొత్త ఐటీ పార్క్ రానుందన్నారు. రాష్ట్రానికి ఐటీ సహా అన్ని రకాల పరిశ్రమలను తీసుకు వస్తామన్నారు. మార్చి 3, 4 తేదీల్లో జరిగే గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ రాష్ట్ర భవిష్యత్తుకు పెద్ద పునాది అన్నారు.
జగన్ వర్క్ ఫ్రమ్ హోమ్ టౌన్
కరోనా (Coronavirus) తర్వాత ఐటీ సంస్థలతో పాటు వివిధ రంగాల్లోని పరిశ్రమలు వర్క్ ఫ్రమ్ హోమ్ తీసుకు వచ్చాయని, ఏపీలో సీఎం వర్క్ ఫ్రమ్ హోమ్ టౌన్ అనే కొత్త విధానాన్ని తీసుకు వచ్చారన్నారు. జగన్ రాష్ట్రంలోని 15,000 గ్రామాల్లో డీజిటల్ లైబ్రరీల మీద ఫోకస్ చేసినట్లు చెప్పారు. విశాఖ తదుపరి గ్లోబల్ ఐటీ కేంద్రంగా మారనుందన్నారు. విశాఖతో పాటు వివిధ ప్రాంతాల్లో మరిన్ని ఐటీ కంపెనీలు, ఇతర పరిశ్రమల ఏర్పాటుకు జగన్ కృషి చేస్తున్నారన్నారు. ప్రపంచంలోనే అభివృద్ధి చెందుతున్న నగరాల్లో విశాఖ ఒకటి అన్నారు.
ఈ కార్యక్రమంలో మంత్రి విడదల రజిని(Vidadala Rajani) కూడా పాల్గొన్నారు. ముఖ్యమంత్రి జగన్ రాష్ట్రాన్ని ఆరోగ్య ప్రదేశ్‌గా మార్చాలని లక్ష్యంగా పెట్టుకున్నారని చెప్పారు. డిజిటల్ హెల్త్ కేర్‌లో విప్లవాత్మక మార్పులకు ఏపీ నాంది పలుకుతోందన్నారు. మారుమూల ప్రాంతాలకు వైద్య సేవలు అందుతున్నాయని, ప్రస్తుతం రోజుకు 66వేల మందికి టెలి కన్సల్టెన్సీలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. నాడు-నేడు ద్వారా హాస్పిటల్స్ ఎంతో వృద్ధి సాధించాయని, 17 మెడికల్ కాలేజీలు నిర్మాణ దశలో ఉన్నాయన్నారు. డిజిటల్ హెల్త్‌లో దేశంలోనే ఏపీ రికార్డు సృష్టించినట్లు చెప్పారు. కరోనా మహమ్మారి సమయంలో డిజిటల్ టెక్నాలజీ ఎంతో ఉపయోగపడిందన్నారు.