Food Delivery: ప్రముఖ ఫుడ్ డెలివరీ యాప్స్ జొమాటో, స్విగ్గీ కస్టమర్లకు షాక్ ఇచ్చాయి. ఫుడ్ డెలివరీ ప్లాట్ఫామ్ ఫీజును 20 శాతం మేర పెంచుతున్నట్లు ప్రకటించాయి. ఢిల్లీ, బెంగళూరు వంటి నగరాల్లో ఇకపై ప్లాట్ఫామ్ ఫీజు రూ.6 వసూలు చేయనున్నట్లు తెలిపాయి. ఇప్పటివరకూ ఈ ఫీజు రూ.5గా ఉంది. బెంగళూరులో స్విగ్గీ ఈ ఫీజును రూ.7కి పెంచింది. రాయితీ తర్వాత దీన్ని రూ.6కు తగ్గించింది. గతంలో కూడా ఒకసారి జొమాటో, స్విగ్గీ సంస్థలు తమ ప్లాట్ఫాం ఫీజును పెంచాయి. 2023 ఆగస్టులో మొదట రూ.2గా ఉన్న ఫీజును విడతల వారీగా పెంచాయి. ఏప్రిల్లో జొమాటో ఈ ఫీజును 25 శాతం మేర పెంచి రూ.5గా చేసింది.
ఢిల్లీ, బెంగళూరు, ముంబై, హైదరబాద్, లఖ్నవూ నగరాలకు ఈ పెంపును వర్తింపజేసింది. ఫాస్ట్ డెలివరీల కోసం ప్రియారిటీ ఫీజు పేరిట ప్రత్యేక రుసుమును కూడా వసూలు చేస్తోంది. తమ ఆదాయాన్ని పెంచడమే లక్ష్యంగా డెలివరీ యాప్లు ఈ ఫీజులు పెంచుతున్నాయి. ప్రస్తుత మార్కెట్లో ఈ రెండు సంస్థలదే పైచేయి కావడంతో లాభాలను పెంచుకోవాలని చూస్తున్నారు. ప్లాట్ఫామ్ ఫీజు పెంచడం ద్వారా రోజుకు రూ.1.25 నుంచి రూ.1.5 కోట్ల వరకూ ఆదాయం పొందాలని లక్ష్యంగా పెట్టుకున్నాయి. ఈక్రమంలోనే ప్లాట్ఫామ్ ఫీజులు పెంచారు.