»Up Bride Calls Off Wedding After Guests Argue Over Sitting In Front Of Cooler
Wedding : కూలర్ దగ్గర కూర్చోవడానికి బంధువుల గొడవ.. పెళ్లి రద్దు చేసుకున్న వధువు
కూలర్ దగ్గరున్న కుర్చీల్లో కూర్చోవడానికి వరుడి తరఫు బంధువులు, వధువు తరఫు బందువులు తగువులాడుకున్నారు. కొట్టుకునేందుకు సిద్ధం అయ్యారు. ఘర్షణ ముదిరిపోవడంతో విసుగు చెందిన వధువు పెళ్లిని రద్దు చేసుకుంటున్నట్లు తెలిపింది. ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.
Woman Calls Off Wedding : ఇటీవల కాలంలో పెళ్లిళ్లలో జరుగుతున్న చిన్న చిన్న గొడవల కారణంగా పెళ్లి రద్దయిన సందర్భాలను వరుసగా వింటూ ఉన్నాం. ఇలాంటి ఘటనే ఒకటి ఉత్తర ప్రదేశ్లో చోటు చేసుకుంది. అక్కడి బల్లియా జిల్లాలోని చిత్బరగావ్ అనే ఊళ్లో శుక్రవారం రాత్రి ఓ వివాహం జరుగుతోంది. ఆ సమయంలో వేడి లేకుండా ఉండేందుకు కూలర్లను(coolers) ఏర్పాటు చేశారు. వాటి ముందున్న కుర్చీల్లో కూర్చోవడానికి వరుడు, వధువు తరఫు బంధువుల మధ్య గొడవ జరిగింది. తీవ్రంగా వాగ్వాదం చోటు చేసుకుంది.
ఆ గొడవ ముదిరి చివరికి వారు కొట్టుకునే వరకు వెళ్లారు. దీంతో ఇదంతా చూస్తున్న వధువు.. వరుడి తరఫు వారిని ఈ విషయంలో నిలదీసింది. దీంతో గొడవ మరింత ముదిరింది. విసుగు చెందిన వధువు(bride) తన పెళ్లిని క్యాన్సిల్(cancel) చేసుకుంది. వరుడు హుకుమ్ చంద్ జైస్వాల్ ఆమెను బ్రతిమలాడే ప్రయత్నం చేశాడు. పెళ్లిళ్లలో ఇలాంటి చిన్న చిన్న గొడవలు సహజమంటూ నచ్చజెప్పే ప్రయత్నం చేశాడు. పెళ్లిని రద్దు చేసుకోవడం సరికాదని అన్నాడు. అయినా వధువు జరుగుతున్న పెళ్లిని కొనసాగించేందుకు ఒప్పుకోలేదు. దీంతో పెళ్లి క్యాన్సిల్(wedding cancelled) అయ్యింది. రెండు వర్గాల బంధువుల దెబ్బలాటతో తన పెళ్లి ఆగిపోయిందని వరుడు మీడియా ముందు ఆవేదన వ్యక్తం చేశాడు. దీనిలో తన ప్రమేయం ఏమీ లేకపోయినా పర్యవసానాలను తాను అనుభవించాల్సి వస్తోందంటూ వాపోయాడు.
మరోవైపు పెళ్లిలో చోటు చేసుకున్న ఈ గొడవ పంచాయతీకి చేరింది. చర్చల్లో ఎలాంటి ఫలితం లేదు. దీంతో ఇరు వర్గాల బంధువులు పోలీస్ స్టేషన్కు చేరారు. ఒకరిపై ఒకరు ఫిర్యాదులు చేసుకున్నారు. కేసు నమోదు చేసిన పోలీసులు వరుడిని, అతడి బంధువైన పంకజ్ని అరెస్టు చేశారు. అలాగే వధువు తండ్రి నంద్జీ గుప్తా, ఆమె సోదరుడు రాజేష్ గుప్తాలను సైతం అరెస్టు చేశారు. దీంతో ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.