»10 Lakh Biryanis 5 3 Lakh Haleem Orders On Swiggy This Ramzan
Biryani : బిర్యానీ!.. 10 లక్షల ఆర్డర్లతో దేశంలోనే హైదరాబాద్ టాప్
రంజాన్ నెలలో అన్ని ప్రాంతాల్లో కంటే హైదరాబాద్‌లో ఏకంగా పది లక్షల బిర్యానీలను తాము డెలివరీ చేశామని స్విగ్గీ ప్రకటించింది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
10 Lakh Biryanis : బిరియానీ అంటే ప్రాంతంతో సంబంధం లేకుండా అందరికీ ఇష్టమే. అయితే హైదరాబాదీయులకు మాత్రం ఈ ఇష్టం పీక్స్‌లో ఉన్నట్లుంది. అందుకనే రంజాన్ నెలలో ఏకంగా పది లక్షల బిర్యానీలను ప్రముఖ ఫుడ్ డెలివరీ యాప్ స్విగ్గీలో ఆర్డర్ చేశారట. ఈ రంజాన్(Ramzan) మాసంలో దేశ వ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో కలిపి తాము 60లక్షలకు పైగా బిర్యానీలను తాము డెలివరీ చేశామని స్విగ్గీ పేర్కొంది. అయితే వాటిలో ఒక్క హైదరాబాద్‌లోనే ఏకంగా 10 లక్షలకు పైగా బిర్యానీ ఆర్డర్లు వచ్చినట్లు తెలిపింది.
మార్చి 12 మొదలుగుని ఏప్రిల్ 8వ తేదీ వరకు ఉన్న రంజాన్ మాసంలో చేసిన డెలివరీలపై ఈ ఆసక్తికర విషయాలను స్విగ్గీ వెల్లడించింది. ఈ నెలలో బిర్యానీతోపాటు హైదరాబాద్‌లో అత్యధికంగా హలీం ఆర్డర్లు(Haleem Orders) కూడా ప్లేస్ అయ్యాయని తెలిపింది. ఇక్కడ ఒక చోటే ఏకంగా 5.3 లక్షల హలీం ఆర్డర్లను తాము డెలివరీ చేసినట్లు స్విగ్గీ వెల్లడించింది.
ఇఫ్తార్ సమయాల్లో (సాయంత్రం 5:30-7 గంటల మధ్యలో) 34 శాతం ఆర్డర్స్ పెరిగాయని పేర్కొన్నది. ముఖ్యంగా చికెన్ బిర్యానీ, మటన్ హలీం, సమోస, ఫలుదా, ఖీర్ టాప్ ప్లేస్‌లో ఉన్నాయని తెలిపింది. దేశవ్యాప్తంగా 60 లక్షల ప్లేట్ల బిర్యానీ ఆర్డర్లు డెలివరీ చేసినట్టు స్విగ్గీ తెలిపింది. మిగిలిన నెలలతో పోలిస్తే రంజాన్ మాసంలో 15 శాతం అమ్మకాలు పెరిగాయని వివరించింది. హలీం ఆర్డర్లలో 1454.88 శాతం పెరుగుదల నమోదైందని వెల్లడించింది.