»Hyderabad Customer Finds Fried Plastic Cover In Biryani
Hyderabad : రెస్టారెంట్ బిర్యానీలో ధమ్ అయిన ప్లాస్టిక్ కవర్.. నెటిజన్ల ఆగ్రహం
హైదరాబాద్లో ఓ వినియోగదారుడు స్విగ్గీ నుంచి బిర్యానీ ఆర్డర్ పెట్టుకున్నాడు. సదరు రెస్టారెంట్ పంపించిన ఆర్డర్లో బాగా ఉడికి ఉన్న ప్లాస్టిక్ కవర్ని చూసి అవాక్కయ్యాడు. ఆ తర్వాత ఏం జరిగిందంటే?
Plastic Cover in Biryani : హైదరాబాద్లో రెస్టారెంట్ల పరిస్థితి అంతకంతకూ దారుణంగా తయారవుతోంది. ఫుడ్ సేఫ్టీ అధికారులు ఎప్పటికప్పుడు రెస్టారెంట్లను తనిఖీలు చేస్తూనే ఉంటున్నారు. రెస్టారెంట్లలో పురుగులు ఉండటం, కుళ్లిపోయిన మాంసాలు ఉండటం లాంటి ఘటనల్నివెలికి తీస్తూనే ఉన్నారు. వాటిని మనం చూస్తూనే ఉన్నాం. అయినా సరే హోటళ్ల తీరు మాత్రం మారడం లేదు. తాజాగా ఓ కస్టమర్ స్విగ్గీలో బిర్యానీ(Biryani) ఆర్డర్ చేసుకున్నాడు. అందులో మాంసం ముక్కతో పాటు బాగా ఉడికిన ప్లాస్టిక్ కవర్(Plastic Cover) కూడా వచ్చింది. దీంతో దాన్ని చూసి అతడు ఆశ్చర్యపోయాడు.
హైదరాబాద్, మణికొండ సమీపంలోని మెహిఫిల్ రెస్టారెంటు నుంచి ఈ ఆర్డర్ని అందుకున్నాడు. దీంతో సదరు వ్యక్తి దాన్ని ఫోటో తీసి తన ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేశాడు. స్విగ్గీ, ఫుడ్ సేఫ్టీ అధికారులకు దాన్ని ట్యాగ్ చేశాడు. ఈ పోస్ట్ చూసిన స్విగ్గీ మాత్రం ఇందుకు సారీ చెప్పింది. ప్లాస్టిక్ కవర్ ఉన్న బిర్యానీని డెలివరీ చేసినందుకు క్షమాపణలు తెలుపుతున్నట్లు వెల్లడించింది. అయితే ఈ విషయమై ఫుడ్ సేఫ్టీ అధికారుల నుంచి ఇంకా స్పందన లేదు.
ఈ ఫోటోని చూసిన నెటిజన్లు మాత్రం అవాక్కవుతున్నారు. రకరకాలుగా కామెంట్లు పెడుతూ హోటళ్లను, అధికారులను తిట్టి పోస్తున్నారు. జనం ఆరోగ్యం సంగతి వీరికి అస్సలు పట్టడం లేదని అంటున్నాను. హైదారాబాద్(Hyderabad ) రెస్టారెంట్ల పరువును మూసీ నదిలో కలిపేస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బయటి ఆహారాన్ని తినడం విషయంలో వారిని తప్పు పట్టడం కంటే మనం కూడా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉందని మరి కొందరు సలహా ఇస్తున్నారు.