»How To Stop Overeating Tips To Avoid Eating Too Much
Over eating : అతిగా తింటున్నారా? తగ్గించుకోండిలా!
కొంత మందికి ఎక్కువగా తినే అలవాటు ఉంటుంది. నిజానికి అది ఏమాత్రమూ మంచి విషయం కాదు. అందుకనే ఆ అలవాటును తగ్గించుకోవడానికి ఏం చేయాలి? టిప్స్ ఇక్కడున్నాయి. చదివేయండి.
How to Stop Over eating : అతి అనర్థం అనే దాన్ని ఏ విషయంలో అయినా మనం తీసుకోవాల్సిందే. కొంత మంది ఎప్పుడు చూసినా తింటూనే కనిపిస్తారు. నిజానికి మనం ఎక్కువగా తినడం(Overeating) అవసరం లేదు. కానీ అదో అలవాటుగా మారిపోవడం వల్ల కొంత మంది ఇలా తింటూ ఉంటారు. ఇలా అతిగా ఎప్పుడూ ఏదో ఒకటి తింటూ ఉండటం వల్ల పలు అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి. ఊబకాయం, గుండె జబ్బులు, మధుమేహం లాంటివి రావచ్చు. అందుకనే అవసరానికి తగినంతగా తినడం(Eating ) ముఖ్యం. రోజూ వ్యాయామమూ అంతే అవసరం. మరి ఈ అతిగా తినే అలవాటు ఉన్న వారు దీన్ని ఎలా తగ్గించుకోవాలి? టిప్స్ ఇక్కడున్నాయి. చదివేయండి.
ఆహారం తినేప్పుడు(Eating ) ఎంత ఎక్కువ తిన్నాం అన్నదానిపై దృష్టి పెట్టకండి. ఎంత పౌష్టికమైన, సమతుల ఆహారం తిన్నాం అన్నదాని పై దృష్టి సారించండి. కార్బోహైడ్రేట్స్ ఎక్కువగా ఉండే ఆహారాలు తినడం వల్ల మళ్లీ వెంటనే ఆకలేస్తుంది. ఏదో ఒకటి తినాలని అనిపిస్తుంది. అలా కాకుండా తినే ప్లేట్లో కార్బ్స్తో పాటుగా ప్రొటీన్లు, ఫైబర్ సైతం సమ పాళ్లలో ఉండేలా చూసుకోవాలి. భోజనంలోనే కాకుండా చిరు తిండ్లలోనూ ఫైబర్ ఎక్కువగా ఉండే వాటిని ఎంచుకోండి. అప్పుడు తొందరగా కడుపు నిండిన భావన కలుగుతుంది. ఎక్కువ తినాలన్న కోరిక కలగదు. మొలకలు, సెనగలు, పల్లీల్లాంటి వాటిలో ప్రొటీన్, ఫైబర్లు తగినంతగా ఉంటాయి. దీంతో మళ్లీ తొందరగా ఆకలి వేయదు.
ఎప్పుడూ ఆకలి వేస్తున్నట్లుగా అనిపిస్తూ ఉంటే తరచుగా నీటిని తాగుతూ ఉండండి. ఇలా చేయడం వల్ల పొట్ట ఖాళీగా ఉన్న భావన కలగకుండా ఉంటుంది. ఏం తింటున్నాం? ఎంత తింటున్నాం? ఎంత తినాలి? అనే విషయాలపై దృష్టి పెట్టండి. కనిపించినదల్లా తింటూ వెళ్లకండి. అది దీర్ఘకాలిక వ్యాధులకు కారణం అవుతుంది. తినేప్పుడు వేరే పనులు చేయకండి. ఫోన్లు, టీవీలు చూస్తూ తినకండి. మైండ్ఫుల్గా ఉండండి.