»Do You Have A Habit Of Eating Late At Night Here The Reasons You Should Stop
Eating : అర్ధరాత్రి భోజనం.. ఇంత ప్రమాదమా?
కొంత మందికి రాత్రి పొద్దుపోయాక భోజనం చేసే అలవాటు ఉంటుంది. తిన్న వెంటనే ఇక నిద్రకు ఉపక్రమిస్తూ ఉంటారు. ఇది పైకి చిన్న విషయంలాగే కనిపించవచ్చగానీ మన ఆరోగ్యంపై చాలా దుష్ప్రభావాన్ని చూపించే అంశం. ఎందుకంటే...?
Eating Late At Night? : రాత్రి తేలికపాటి ఆహారం తీసుకోవాలి. ఆలస్యంగా భోజనం చేయకూడదు. నిద్రకు ముందే ఆహారం అంతా అరిగిపోవాలి…. లాంటి మాటల్ని మనం తరచుగా వింటూనే ఉంటాం. అయితే ఆచరణలో పెట్టేది మాత్రం చాలా కొద్ది మంది మాత్రమే. చాలా మంది అర్ధరాత్రిళ్లు(Late Night) తిని వెంటనే నిద్రకు ఉపక్రమిస్తుంటారు. ఇలా చేయడం వల్ల మనకు కలిగే అనారోగ్యాలు చాలానే ఉన్నాయి. అవేంటో తెలిస్తే ఈ అలవాటును మార్చుకునే ప్రయత్నం చేస్తారు.
నిద్రపోవడానికి మూడు గంటలలోపు భోజనం చేసే వారిలో పెద్ద పేగు క్యాన్సర్ వచ్చే అవకాశాలు పెరుగుతున్నాయని తాజా అధ్యయనాల్లో తేలింది. రాత్రి తొందరగా భోజనం చేసే వారితో పోలిస్తే ఆలస్యంగా భోజనం చేసే వారిలో పేగుల్లో కణితి(అడినోమా) ఏర్పడే అవకాశాలు 46 శాతం అధికంగా ఉన్నాయట. ఈ విషయాన్ని షికాగో రష్ యూనివర్సిటీ పరిశోధకులు వెల్లడించారు.
ఇలా ఏర్పడే కణితలు తొలుత క్యాన్సర్లుగా ఉండవు. కానీ తర్వాత్తర్వాత అవి క్యాన్సర్‌గా మారే అవకాశాలు ఉంటాయి. ఇలా పెద్ద పేగు క్యాన్సర్‌కు ఆలస్యంగా భోజనం చేయడానికీ మధ్య గల సంబంధాన్ని కూడా వీరు వెల్లడించారు. ఆలస్యంగా భోజనం చేసినప్పుడు పేగులు అది పగటి సమయం అనుకుంటాయి. మెదడేమో రాత్రి సమయం అనుకుంటుంది. అందువల్ల పేగుల్లో జీవ గడియారం(The Biological Clock) దెబ్బతింటుంది. మనలోని బరువు పెరగడానికీ, క్యాన్సర్లు రావడానికీ కారణం అవుతుంది.