మంత్రి కేటీఆర్(ktr) వ్యాఖ్యలపై కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్(ashwini vaishnaw) స్పందించారు. కేటీఆర్ తెలంగాణకు ఇచ్చిన నిధుల లెక్కలు తెలుసుకుని మాట్లాడాలని స్పష్టం చేశారు. తెలంగాణలో రైల్వే లైన్ల అభివృద్ధికి నిధులు ఇప్పటికే కేటాయించినట్లు గుర్తు చేశారు. రాష్ట్రం ఏర్పాటైన తర్వాత రూ.4,418 కోట్ల నిధులు కేటాయించినట్లు చెప్పారు. మరోవైపు తెలంగాణలో రూ.29,581 కోట్ల విలువైన రైల్వే ప్రాజెక్టు పనులు జరుగుతున్నాయని అన్నారు. ఇంకో 39 రైల్వే స్టేషన్లు అభివృద్ధి చేస్తున్నట్లు వెల్లడించారు.
తెలంగాణలో వేగన్ తయారీ కేంద్రం ఏర్పాటుకై రూ.521 కోట్లు కేటాయించినట్లు తెలిపారు. కానీ అందుకు 160 ఎకరాల భూమి అవసరం కాగా, ప్రభుత్వం 150 ఎకరాలే ఇచ్చిందన్నారు. కేసీఆర్ ప్రభుత్వం నుంచి సరైన సహకారం అందడం లేదని పేర్కొన్నారు. మరోవైపు కొత్తగా 20 ఎంఎంటీఎస్ రైళ్లు కూడా కేటాయించామని..అవి సికింద్రాబాద్ నుంచి మేడ్చల్ మధ్య ప్రయాణించనున్నట్లు చెప్పారు. దీంతోపాటు రాష్ట్రానికి రెండు ఎక్స్ లెన్స్ కేంద్రాలు కూడా ఇచ్చామని కేంద్రమంత్రి వివరించారు.