ప్రారంభానికి ముందే తెలంగాణ కొత్త సచివాలయంలో అగ్ని ప్రమాదం సంభవించింది. శుక్రవారం తెల్లవారుజామున అగ్ని ప్రమాదం జరిగినట్లు సమాచారం. సచివాలయం ప్రధాన గుమ్మంపై దట్టంగా మంటలు అలుముకున్నాయి. 11 ఫైరింజన్లు మంటలను అదుపులోకి తీసుకొచ్చే ప్రయత్నాలు చేస్తున్నారు. ఎలక్ట్రిక్ పనులు చేస్తుండగా షార్ట్ సర్క్యూట్ ఏర్పడి ప్రమాదం సంభవించిందని తెలుస్తున్నది. భవనం 5, 6వ అంతస్తుల్లో ఈ ప్రమాదం జరిగినట్లు సమాచారం. అయితే ప్రమాదానికి సంబంధించి అధికారులు వివరాలు వెల్లడించడం లేదు.
ప్రమాద సమయంలో ఎంత మంది కార్మికులు ఉన్నారు అనేది తెలియడం లేదు. అయితే ఇది ప్రమాదం కాదు ప్రయోగాత్మకంగా మాక్ డ్రిల్ చేసినట్లు కూడా వార్తలు వస్తున్నాయి. భవిష్యత్ లో అగ్ని ప్రమాదం సంభవిస్తే ఎలా నియంత్రించాలనే దానిపై మాక్ డ్రిల్ నిర్వహించినట్లు కూడా సమాచారం వస్తున్నది. అయితే దీనిపై అధికారులు ఎలాంటి ప్రకటన చేయకపోవడంతో అగ్నిప్రమాదమా? మాక్ డ్రిల్ కార్యక్రమమా? అనేది స్పష్టత రావడం లేదు.
ప్రారంభోత్సవం వాయిదా?
ఈ సచివాలయాన్ని ఈనెల 17వ తేదీన తన పుట్టిన రోజున సీఎం కేసీఆర్ ప్రారంభించాల్సి ఉంది. ఇప్పటికే ప్రారంభోత్సవానికి ఏర్పాట్లు చకచకా జరుగుతున్నాయి. ఈ కార్యక్రమానికి తమిళనాడు సీఎం స్టాలిన్, ఝార్ఖండ్ సీఎం హేమంత్ సోరేన్, యూపీ మాజీ సీఎం అఖిలేశ్ యాదవ్ కూడా హాజరవుతున్నారు. ప్రస్తుతం జరిగింది అగ్ని ప్రమాదం అయితే మాత్రం సచివాలయ ప్రారంభోత్సవం వాయిదా పడే అవకాశం ఉంది. ఆదిలోనే అపశ్రుతి జరగడంతో ప్రతిపక్షాలు మండి పడుతున్నాయి.