Do you know how to change date of birth in aadhaar card?
Aadhaar: నెలల బాలుడి నుంచి వృద్ధుల వరకు అందరికీ ఆధార్ కార్డు తప్పనిసరి అన్న విషయం తెలిసిందే. మార్కెట్లో చాలా పనులకు ఆధార్ ఉండాల్సిందే. కొత్తగా సిమ్ తీసుకోవాలన్నా, బ్యాంకు ఖాతా తీసుకోవాలన్నా దేనికైనా ఆధార్ ఉండాల్సిందే. అంతటి ముఖ్యమైన ఆధార్ కార్డులో కొన్ని తప్పులు ఉంటున్నాయి. డేట్ ఆఫ్ బర్త్ విషయంలో కానీ, పేరు స్పెల్లింగ్ విషయంలో కానీ, చిరునామా ఇలా కార్డులో తప్పులను సరిచేసుకునే వెసులబాటును యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా (యూఐడీఏఐ) కల్పించింది. పేరు, చిరునామా, పుట్టిన తేదీ, జెండర్ ఏ వివరాలైనా ఒక్కసారి మాత్రమే మార్చుకునే అవకాశం ఇచ్చింది. పుట్టిన తేదీకి సంబంధించిన పొరపాట్లను సరిదిద్దుకోవడానికి తగిన గుర్తింపు పత్రంతో డేటాఫ్ బర్త్ను మార్చుకోవచ్చు అని తెలిపింది.
దీనికోసం పాన్‌కార్డ్, బర్త్ సర్టిఫికెట్, పాస్ పోర్ట్, బ్యాంక్ పాస్ బుక్, పదో తరగతి మార్కుల మెమోలలో ఏదైనా ఒక దానిని ప్రూఫ్‌గా చూపించి బర్త్ డే డేట్‌ను మార్చుకోవచ్చని తెలిపింది. అయితే, ఈ ప్రక్రియను ఆధార్ సెంటర్లోనే చేసుకోవాలి. ఆధార్ కార్డుకు సంబంధించిన సమస్యల పరిష్కారానికి యూఐడీఏఐ ప్రత్యేకంగా హెల్ప్ లైన్ నెంబర్ 1947 ను ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చింది. దగ్గర్లోని ఆధార్ సెంటర్‌కు వెళ్లి కరెక్షన్ ఫారమ్ నింపాలి. పుట్టిన తేదీ ప్రూఫ్ జతచేయాలి. రూ. 50 ఫీజు చెల్లించి, బయోమెట్రిక్ వివరాలు ఇస్తే సరిపోతుంది. తరువాత కార్డును డౌన్ లోడ్ చేసుకోవచ్చు.