వాట్సాప్ లో ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్(ఏఐ) అసిస్టెంట్‌ని మెటా సంస్థ విడుదల చేసింది. మెసేజింగ్ చేయడంలో దీన్ని ఇంటిగ్రేట్ చేసుకునే వెసులుబాటును కల్పించింది. దీనికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.
Meta AI Assistant : మెటా సంస్థ వాట్సాప్‌లో ఏఐ అసిస్టెంట్‌ని విడుదల చేసింది. దీని ద్వారా వాట్సాప్ వినియోగదారులు మెసేజింగ్‌లో నేరుగా ఏఐని ఇంటిగ్రేట్ చేసుకోవచ్చు. కేవలం ఇంగ్లీష్‌లోనే అందుబాటులో ఉండే మెటా ఏఐ… భారత్ సహా మరి కొన్ని దేశాల్లో లభిస్తుంది. ఏఐ అసిస్టెంట్… యూజర్లకు మెరుగైన సంభాషణల సామర్ధ్యం, సమాచార అన్వేషణ, నేరుగా వాట్సాప్‌లోనే(Whatsapp) సూచనలు పొందే వెసులుబాటు కల్పిస్తుంది.
ఇంతకీ ఈ ఏఐ అసిస్టెంట్‌తో మనం ఏమేం చేయవచ్చనేది ఇప్పుడు తెలుసుకుందాం. ఛాట్ జీపీటీ, గూగుల్ జెమిని, మైక్రోసాఫ్ట్ కోపైలెట్, ఓపెన్ ఏఐ… తరహాలో దీన్ని మనం వాట్సాప్‌లో వాడుకోవచ్చు. ఇది మన ప్రశ్నలకు సమాధానాలు ఇస్తుంది. టెక్స్ట్‌ని జనరేట్ చేస్తుంది. భాషల్ని అనువదిస్తుంది. ఐడియాలను సజెషన్ చేస్తుంది. గ్రూప్ చాట్స్‌లోనూ ఉపయోగపడుతుంది. మెటా ఏఐతో(Meta AI)మనం చాలా రకాలుగా ఇంటరాక్ట్ కావడానికి అవకాశం ఉంది.
అయితే సాధారణంగా మన వాట్సాప్ ఛాటింగ్‌లు అన్నీ ఎండ్ టు ఎండ్ ఎన్క్రిప్షన్ని కలిగి ఉంటాయి. అంటే మన సమాచారం వేరే వారికి తెలిసే అవకాశాలు ఉండవు. అయితే మనం ఈ ఏఐ అసిస్టెంట్ ద్వారా రాబట్టుకునే సమాచారం అంతా ఎన్క్రిప్టెడ్ కాదు. ఏఐ(AI)కి శిక్షణ ఇచ్చేందుకు యూజర్ డేటా, ప్రాంఫ్ట్స్ను తాము వాడుకుంటామని అందుకే సదరు డేటా ఎన్క్రిప్టెడ్ కాదని మెటా చెబుతోంది.