సాధారణంగా అందరి కుటుంబాల్లోనూ నాలుగైదు ఓట్లు ఉండటం మనం చూస్తూనే ఉంటాం. అయితే అస్సాంలోని ఓ కుటుంబంలో మాత్రం ఏకంగా 350 మంది ఓటర్లు ఉన్నారట. ఆ కధాకమామీషు ఏంటో చదివేద్దాం రండి.
Loksabha Polls : ఉమ్మడి కుటుంబాల్లో 20, 30 మంది ఓటర్లు ఉండే కుటుంబాలు భారత దేశంలో అక్కడక్కడగా అరుదుగా కనిపిస్తుంటాయి. అయితే అస్సాంకి(Assam) చెందిన ఓ కుటుంబంలో మాత్రం పదుల సంఖ్యలో కాకుండా ఏకంగా వందల సంఖ్యలో ఓటర్లు ఉన్నారు. ఏకంగా 350 మంది ఓటర్లు ఒకే కుటుంబంలో ఉండటం విచిత్రం. వీరంతా వచ్చే ఎన్నికల్లో తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ఈ కుటుంబానికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.
అస్సాం(Assam) రాష్ట్రంలోని సోనిట్పూర్ జిల్లాలో పులోగురి నేపాలీ పామ్ అనే గ్రామం ఉంది. అక్కడ రోన్ బహదూర్ తాపా అనే పెద్దాయన ప్రస్తుతం చనిపోయాడు. ఆయనకు ఐదుగురు భార్యలు. ఆ భార్యలకు 12 మంది కొడుకులు, 9 మంది బిడ్డలు ఉన్నారు. 12 మంది కొడుకులకు మొత్తం 56 మంది పిల్లలు ఉన్నారు. 9 మంది కూతుళ్లకు 50 మంది పిల్లలు ఉన్నారు. వీళ్ల పిల్లలు, వాళ్ల పిల్లలు, కుటుంబ సభ్యులు అంతా కలిసి మొత్తం రోన్ తాపా కుటుంబంలో 1200 మంది ఉన్నారు. వీరిలో 350 మందికి ఓటు హక్కు ఉంది.
ఏప్రిల్ 19న మొదటి విడుత లోక్ సభ ఎన్నికల్లో వారి గ్రామంలోనూ ఎన్నికలు జరుగుతున్నాయి. దీంతో తాపా కుటుంబంలోని ఓటర్లంతా(Voters) ఓటు హక్కును వినియోగించుకుంటారు. భారత దేశంలో అత్యధిక మంది ఓటర్లున్న అతి కొద్ది కుటుంబాల్లో తాపా కుటుంబం ఒకటిగా నిలిచింది. ఇదిలా ఉండగా అసోంలోని మొత్తం 14 లోక్సభ స్థానాలకు మూడు విడతల్లో ఏప్రిల్ 19, ఏప్రిల్ 26, మే 7న పోలింగ్ జరగనుంది.