Soda Effects : వేసవి కాలంలో ఏదో ఒకటి చల్లగా తాగాలని అందరికీ అనిపిస్తూ ఉంటుంది. అందుకనే చాలా మంది శీతల పానీయాలు, ఎనర్జీ డ్రింక్‌లు, సోడాల్లాంటి వాటిని తాగుతూ ఉంటారు. అయితే కొంత మంది వీటన్నింటిలో సోడాలను ఎక్కువగా ఇష్టపడి తాగుతూ ఉంటారు. దీన్నే ఆంగ్లంలో కార్బొనేటెడ్ వాటర్ ( carbonated water) అంటారు. అంటే కార్బన్ డయాక్సైడ్ గ్యాస్‌ని నీటిలోకి ప్రెజర్‌తో ఎక్కించి మూత పెడతారు. దీనికి రకరకాల ఫ్లేవర్లను కలిపి రకరకాల సోడాలను రంగుల్లో తయారు చేస్తుంటారు. అయితే ఇది ఆరోగ్యానికి మంచిదా? ఎక్కువగా దీన్ని తాగితే ఏమవుతుంది? తెలుసుకుందాం రండి.
చక్కెర కలిపిన సోడాని(soda) ఎక్కువగా తీసుకోవడం వల్ల శరీరంలో ఇన్సులిన్ ప్రతిస్పందనలో హెచ్చుతగ్గులు పెరిగే అవకాశం ఉంటుంది. దీని వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు పెరిగిపోతాయి. ఫలితంగా తీవ్రమైన అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశాలుంటాయి. సోడా దంత ఆరోగ్యాన్ని కూడా పాడు చేస్తుంది. దీనిలో ఆమ్లత్వ లక్షణం, చక్కెర అధికంగా ఉంటాయి. ఇవి రెండూ కూడా దంతాల ఎనామిల్‌ని దెబ్బతినేలా చేస్తాయి.
చాలా సోడాల్లో ఫాస్ఫోరిక్ యాసిడ్ అనేది ఎక్కువగా ఉంటుంది. ఇది తాగడం వల్ల కాల్షియంని మన శరీరం సరిగ్గా శోషించుకోలేదు. ఫలితంగా మనలో కాల్షియం లోపం రావొచ్చు. ఫలితంగా ఎముకలు గుల్లబారిపోతాయి. అయితే చక్కెర లేకుండా ఉండే సాధారణ సోడాని అప్పుడప్పుడూ తాగడం వల్ల ఎలాంటి ఇబ్బందీ ఉండదు. ఇది జీర్ణ క్రియను వేగవంతం చేస్తుంది. మలబద్ధకం సమస్యను తగ్గిస్తుంది.