టాలీవుడ్ రౌడీ హీరో విజయ్ దేవరకొండ, పాన్ ఇండియా స్టార్, నేషనల్ క్రష్ రష్మిక మందన్నా ఇద్దరూ లవ్ బర్డ్స్ అని చెప్పుకుంటూ ఉంటారు కదా. ఇద్దరి మధ్య నిజంగా లవ్ ఉందో లేదో తెలియదు కానీ.. ఈ ఇద్దరు మాత్రం ప్రస్తుతం చెట్టాపట్టాలేసుకొని తిరుగుతున్నారు అంటూ సోషల్ మీడియా కోడై కూస్తోంది. నిజానికి వీళ్లిద్దరూ కలిసి నటించింది రెండు సినిమాల్లోనే. కానీ.. వీళ్ల జంట ఆన్ స్క్రీన్ మీద బాగా వర్కవుట్ అయింది.
గీత గోవిందం సినిమాతోనే ఈ జంట సూపర్ సక్సెస్ అయింది. ఆ తర్వాత డియర్ కామ్రేడ్ సినిమాలోనూ ఇద్దరూ కలిసి నటించారు. ఈ రెండు సినిమాలతో వీళ్లిద్దరి మధ్య స్నేహం చిగురించింది. ఆ స్నేహంతోనే ఇద్దరూ కలిసి అప్పుడప్పుడు టూర్స్ కు వెళ్తుంటారు. ఎక్కడో ఒకచోట ఎవరికో ఒకరికి తారసపడుతుంటారు. వాళ్లు ఫోటోలు తీసి సోషల్ మీడియాలో పెడుతుంటారు. తాజాగా ఇద్దరూ దుబాయ్ లో ఉన్నారని, వాళ్ల ఫోటోలు తీసి మరీ సోషల్ మీడియాలో పెట్టారు. ఇద్దరూ దుబాయ్ కి వెళ్లారని.. మళ్లీ మీరిద్దరూ కలిసి సినిమాల్లో నటిస్తే చూడాలని ఉందంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. ఆ ఫోటోలను కూడా సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు.