ప్రపంచంలోనే అతి పెద్ద జాతర, తెలంగాణ కుంభామేళాగా ఖ్యాతి పొందిన ములుగు జిల్లాలోని మేడారంలో సందడి మొదలైంది. ఫిబ్రవరి 1 నుంచి 4వ తేదీ వరకు మినీ జాతర జరుగనుంది. సమ్మక్క, సారలమ్మ మహా జాతర రెండేండ్లకు ఒకసారి జరుగుతుందని అందరికీ తెలిసిందే. మహా జాతర తర్వాతి సంవత్సరం వచ్చే మాఘశుద్ధ పౌర్ణమికి మండమెలిగె పండగ వస్తుంది. దీన్ని మినీ మేడారం జాతర అంటారు. ఈ జాతరకు కూడా పెద్ద సంఖ్యలో భక్తులు తరలి రానున్నారు.
ఈ జాతర నేటి నుంచి ప్రారంభం కానుంది. పండుగ సందర్భంగా సమ్మక్క, సారలమ్మ గద్దెలను శుద్ధి చేసి ప్రత్యేక పూజలు చేస్తారు. వనదేవతలను కొలిచే వంశస్తులు వారి బంధువులను పిలిపించుకుని అమ్మవార్లకు మొక్కులు సమర్పిస్తారు. ఈ వేడుకల కోసం జిల్లా యంత్రాంగం అన్నీ ఏర్పాట్లు పూర్తి చేసింది. మినీ జాతరకు తరలివచ్చే భక్తుల కోసం అన్నీ ఏర్పాట్లు సిద్ధం చేశామని జిల్లా అధికారులు ప్రకటించారు. తెలంగాణ నుంచే కాక మహారాష్ట్ర, ఇతర ప్రాంతాల నుంచి భక్తులు తరలి వస్తారు.