Medaram మేడారం జాతరకు వచ్చే పర్యాటకులకు లక్నవరం సందర్శన రద్దు
ఉమ్మడి వరంగల్ జిల్లాలో పర్యాటకులను ఆకర్షించే ప్రాంతాలు అనేకం ఉన్నాయి. దీంతో మేడారం జాతరకు వెళ్లే పర్యాటకులు ఆ చుట్టుపక్కలున్న ప్రాంతాలను చూసి వస్తుంటారు. అయితే లక్నవరం టూరిజంని నిలిపి వేసినట్లు స్థానిక అధికారులు వెల్లడించారు.
Medaram Tourists : మేడారం జాతరకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రజలే కాకుండా ఇతర ప్రాంతాల నుంచి జనం తండోప తండాలుగా తరలి వస్తుంటారు. మొక్కులు చెల్లించుకుని ఆ చుట్టు పక్కల ఉన్న పర్యాటక ప్రాంతాలను కూడా చూసి వెళుతుంటారు. అయితే లక్నవరం సరస్సు కూడా అక్కడ ప్రధాన పర్యాటక ఆకర్షణగా ఉంది. అయితే రద్దీని దృష్టిలో ఉంచుకుని దాని పర్యాటకాన్ని రద్దు చేస్తున్నట్లు స్థానిక అధికారులు వెల్లడించారు.
ములుగు జిల్లాలో గోవిందరావు పేట మండలంలో ఉన్న లక్నవరం చెరువును పర్యాటక పరంగా బాగా అభివృద్ధి చేశారు. సరస్సులో బోటు షికారు, స్పీడ్బోట్లు, సైక్లింగ్ లాంటి వాటినీ పెట్టి పర్యాటకుల్ని ఆకర్షిస్తున్నారు. చుట్టూ కొండలు, దట్టంగా ఉన్న చెట్లు, నీళ్లతో ఉన్న వాతావరణంలో రిసార్టులను కూడా ఏర్పాటు చేశారు. దీంతో అక్కడికి వెళ్లి ఉండటానికి బోటింగ్‌లు చేయడానికి అంతా ఆసక్తి చూపిస్తున్నారు.
మేడారం జాతర(Medaram Jathara) సందర్భంగా ఆ వైపు పెద్ద ఎత్తున జనం తరలి వస్తున్నారు. దీంతో అక్కడ వాహనాల రద్దీ కూడా బాగా పెరిగిపోయింది. 25వ తారీఖు వరకు లక్నవరం రూట్‌ని మూసివేస్తున్నట్లు అక్కడ బ్యానర్లను ఏర్పాటు చేశారు. ఇందుకు పర్యాటకులంతా సహకరించాలని కోరారు.