Traffic Rules : హైదరాబాద్‌లో కొత్త ట్రాఫిక్ రూల్స్.. ఈ సమయాల్లో భారీ వాహనాల నిలుపుదల
హైదరాబాద్ రోడ్లపై ట్రాఫిక్ ఎప్పుడూ సమస్యగానే ఉంటోంది. దీని పరిష్కారం దిశగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం అడుగులు వేస్తోంది. దీనిలో భాగంగా కొన్ని వేళల్లో భారీ వాహనాలను నగరంలోకి అనుమతించడం లేదు.
New Traffic Rules in Hyderabad : హైదరాబాద్, సికింద్రాబాదుల్లో ట్రాఫిక్ కష్టాలు స్థానికులకు రోజువారీ సమస్యలే. మెట్రో వచ్చిన తర్వాత కార్యాలయాలకు వెళ్లే వారు కాస్త సమయానికి చేరుకునే వెసులుబాటు కలుగుతోంది. అయినప్పటికీ కూడా ఈ ట్రాఫిక్ సమస్యకు ఇక్కడ శాశ్వత పరిష్కారం లభించడం లేదు. ఈ విషయంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రత్యేకంగా స్పందించారు. దీంతో పోలీసు ఉన్నతాధికారులు రంగంలోకి దిగి కార్యాచరణ ప్రారంభించారు.
ఉదయం 8 నుంచి రాత్రి 10 గంటల వరకు ప్రైవేట్ బస్సులకు(Private Buses) జంట నగరాల్లోని ఏ రోడ్డులో ఇక నుంచి రాకపోకలు సాగించడానికి ఉండదని పోలీసు అధికారులు తెలిపారు. ఆర్టీసీ బస్సులకు ఈ నిబంధనలు వర్తించవు. డీసీఎం, ఏచర్, స్వరాజ్ మజ్దా వంటి సరుకు రవాణ వాహనాలు ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 12 లోపు, సాయంత్రం 4 నుంచి 9 లోపు నగర రోడ్లపైకి అనుమతిని నిలిపివేశారు. రెండు టన్నులకు మించి నిర్మాణ వ్యర్థాలు తరలించే వాహనాలకు ఉదయం 9 గంటల నుంచి 11.30 వరకు, సాయంత్రం 5 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు జంట నగరాల రోడ్ల మీదకు అనుమతించరు. పది టన్నులకు మించి తరలించే ప్రభుత్వ వాహనాలకు ఉదయం 7 నుంచి రాత్రి 11 వరకు అనుమతి లేదు.
లారీలు, ట్రక్కులు, టస్కర్లు, ట్రాలీల్లాంటి భారీ వాహనాలను పగటి వేళల్లో నగరంలోకి అనుమతించబోమని నగర పోలీసు కమిషనర్ కొత్తకోట శ్రీనివాస్‌రెడ్డి తెలిపారు. రాత్రి వేళల్లో సూచించిన రోడ్లలో మాత్రమే వీటిని అనుమతిస్తామని అన్నారు. నిర్మాణ సామాగ్రి వాహనాలకు కూడా పగటి వేళలో నగరంలోకి అనుమతి నిరాకరించినట్లు వెల్లడించారు. కేవలం రాత్రి 11 గంటల నుంచి ఉదయం 7 గంటల లోపు వరకే మాత్రమే ఆయా వాహనాలకు సిటీలోకి అనుమతి ఉండనుంది.