Medaram Jathara : నేడు మేడారం జాతరకి రానున్న సీఎం, గవర్నర్లు
రెండేళ్లకోసారి జరిగే మేడారం జాతర అత్యంత కోలాహలంగా కొనసాగుతోంది. గురువారం సీఎం రేవంత్ రెడ్డి, గవర్నర్ తమిళ సై, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తదితరులు హాజరు కానున్నారు.
Medaram Samm akka Saralamma Jathara : ఆసియాలోనే అతి పెద్ద ఆదివాసీ జన జాతరగా పేరు గాంచిన మేడారం జాతర అత్యంత కోలాహలంగా కొనసాగుతోంది. నేడు ఇక్కడ జరిగే జాతర మహోత్సవానికి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, గవర్నర్ తమిళ సై, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తదితర ప్రముఖులు హాజరుకానున్నారు. ఈ జాతరను వీక్షించేందుకు పెద్ద ఎత్తున భక్త జనం తరలి వస్తున్నారు. దీంతో అరణ్యం కాస్తా జనారణ్యంగా మారిపోయింది.
భక్తులు భారీగా గద్దెల వద్దకు చేరుకొని ఇలవేల్పులైన తల్లులకు నమస్కరిస్తున్నారు. జంపన్న వాగులో పవిత్ర స్నానాలాచరించి నిలువెత్తు బంగారం, పసుపు, కుంకుమలను సమర్పిస్తున్నారు. తెలుగు రాష్ట్రాలు సహా, చత్తీస్ గఢ్ , మహారాష్ట్ర, ఝార్ఖండ్ తదితర రాష్ట్రాల నుంచి పెద్ద సంఖ్యలో జనం తరలివస్తున్నారు. మేడారం (Medaram) జాతర కోసం దేవాదాయ, పోలీసు, రెవెన్యూ, పంచాయతీ రాజ్ శాఖలు సమన్వయంతో పనిచేస్తున్నాయి.
ఇక్కడికి తరలి వస్తున్న భక్తులకు పార్కింగ్ తదితర చిన్న, చిన్న సమస్యలు ఎదురైనప్పటికీ, తాగునీరు, వసతి, పారిశుద్ధ్య సౌకర్యాలు కల్పించినట్లు అధికారులు చెబుతున్నారు. మరోవైపు భక్తులకు ఉచితంగా ప్రసాదం పంపిణీ చేయడంతో పాటు ఆన్లైన్, పోస్టల్ ద్వారా సైతం అందిస్తామని దేవాదాయ శాఖ అధికారులు తెలిపారు. మరోవైపు జాతరకు వచ్చేందుకు ప్రత్యేక బస్సులు, రైళ్లతో పాటు పర్యాటక శాఖ హెలికాప్టర్ల సేవలు అందుబాటులోకి తెచ్చింది. భక్తుల ముసుగులో దొంగలుంటారని బంగారు ఆభరణాలు, నగదు విషయంలో అప్రమత్తంగా ఉండాలని పోలీసులు హెచ్చరిస్తున్నారు.