Rakul Preet Singh wedding : తెలుగులో అనేక చిత్రాల్లో కథా నాయికగా నటించిన హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ (Rakul Preet Singh). బుధవారం ఆమె వివాహం బాలీవుడ్ నిర్మాత జాకీ భగ్నానీ(Jackky Bhagnani)తో అంగరంగ వైభవంగా జరిగింది. వీరిద్దరూ గత మూడేళ్లుగా ప్రేమలో ఉన్న సంగతి అందరికీ తెలిసిందే. ఈ జంట ఇప్పుడు గోవాలోని ఓ ప్రైవేట్ రిసార్టులో వివాహం చేసుకున్నారు. ఈ కార్యక్రమానికి పెళ్లి కొడుకు, పెళ్లి కూతురు తరఫు కుటుంబ సభ్యులు, పలువురు సెలబ్రిటీలు హాజరయ్యారు.
లేత ఉల్లి రంగు దుస్తుల్లో రకుల్‌ప్రీత్ సింగ్ పెళ్లి కూతురిగా మెరిసిపోతూ కనిపించారు. లేత బంగారు రంగు పైజమాలో వరుడు కూడా అంతే హుందాగా కనువిందు చేశారు. ఇప్పుడు ఈ వివాహానికి సంబంధించిన ఫోటోలు నెట్లో వైరల్‌గా మారాయి. వీరి వివాహ మహోత్సవం సందర్భంగా పలువురు సెలబ్రిటీలు, ఫ్యాన్స్ ఆమెకు అభినందనలు తెలియజేస్తున్నారు.
కన్నడ చిత్రం గిల్లీతో సినీ రంగంలోకి ప్రవేశించిన రకుల్ ప్రీత్ సింగ్ దశాబ్ద కాలంగా సినిమాలు చేస్తూ వస్తున్నారు. బాలీవుడ్లో అయితే ఒకే ఏడాదిలో ఐదు సినిమాల్లో నటించి ఆశ్చర్యపరిచారు. ఎటాక్, రన్‌వే 34, కట్‌పుట్లీ, డాక్టర్ జీ, థాంక్ గాడ్ చిత్రాలు 2022లో విడుదల అయ్యాయి. రకుల్ ప్రీత్ సింగ్ బాలీవుడ్లోనే కాకుండా దక్షిణాది సినిమాల్లోనూ తనదైన నటనతో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. సరైనోడు, రారండోయ్ వేడుక చూద్దాం, నాన్నకు ప్రేమతో, మన్మధుడు2, ధృవ లాంటి సినిమాల్లో నటించి తెలుగు ప్రేక్షకులకూ దగ్గరయ్యారు.