»The First Tribal Judge In Tamil Nadu At The Age Of 23 Sripatis Success Journey
Tribal judge: తమిళనాడులో 23 ఏళ్లకే తొలి గిరిజన జడ్జి.. సక్సెస్ జర్నీ
23 ఏళ్లలోనే సివిల్ జడ్జిగా అర్హత పొంది చరిత్ర సృష్టించారు శ్రీపతి. నిండు చూలాలుగా ఉండగా పరీక్ష రాసి మరీ ఆమె అర్హత పరీక్షలో ఉత్తీర్ణత సాధించారు. ఇప్పటి వరకూ తమిళనాడులో గిరిజన మహిళా జడ్జి లేరు. ఈ నేపథ్యంలో సివిల్ జడ్జి వి.శ్రీపతి సక్సెస్ జర్నీ మీకోసం.
The first tribal judge in Tamil Nadu at the age of 23.. Sripati's success journey
Tribal judge: తిరువణ్ణామలైలోని గిరిజన గూడెంలో కలియప్పన్ అనే మలయాళి రైతుకు తొలి కుమార్తెగా జన్మించింది ఈ శ్రీపతి. ఈమె చిన్నప్పటి నుంచే చాలా చురుగ్గా ఉండేది. తిరువణ్ణామలై గిరిజన గ్రామాల్లో అప్పట్లో చదువు సరిగ్గా లేదు. వీళ్ల గూడెం నుంచి బస్సెక్కాలంటే 15 కిలోమీటర్లు నడవాలి. అందుకే కుమార్తె చదువు కోసం కలియప్పన్ అక్కడి నుంచి వంద కిలోమీటర్ల దూరంలో ఉన్న యలగిరి హిల్స్ కు మకాం మార్చాడు. ఇక్కడా కొండల్లో వ్యవసాయమే అయినా వీళ్లుండే అత్తనాపూర్‌లో ఇంటర్ వరకూ చదివించే మిషనరీ స్కూల్ ఉంది. అక్కడే శ్రీపతి ఇంటర్ వరకూ చదువుకుంది. ఇప్పుడు చదివి ఏం చేయాలంటా అని తోటి తెగ వారు తండ్రిని, తల్లిని ప్రశ్నించి ఇబ్బంది పెట్టినా వాళ్లు తమ కుమార్తె చదవాల్సిందేనని ప్రోత్సహించారు. ఇంటర్ అయ్యాక లా చదవాలని నిశ్చయించుకుంది శ్రీపతి.
తమిళనాడు తిరుపట్టూరు జిల్లాలోని యలగిరి హిల్స్ నుంచి ఒక కారు చెన్నైకి బయలుదేరింది. నాలుగున్నర గంటల ప్రయాణం. లోపల ఉన్నది పచ్చి బాలింత. అంతకు ముందు రోజే ఆమెకు ప్రసవమయ్యి ఆడపిల్ల పుట్టింది. కాని మరుసటి రోజు చెన్నైలో తమిళనాడు పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఎగ్జామ్ ఉంది. అందులో ఉత్తీర్ణత సాధిస్తే ఆమె సివిల్ జడ్జ్ అర్హత సాధిస్తుంది. అందుకే ప్రయాణం చేస్తోంది. ఆమె పేరు వి. శ్రీపతి. వయసు 23. ఆమెకు తోడుగా ఉన్నది భర్త వెంకటేశన్, తండ్రి కలియప్పన్. కొండ ప్రాంతంలో పోడు వ్యవసాయం చేసుకుని తరతరాలుగా బతుకుతున్న మలయలి తెగలో ఆడపిల్లలు చదువుకోవడం చాలా విశేషం. లా చేయడం ఇంకా పెద్ద విశేషం. సివిల్ జడ్జి కావడం అంటే నిజంగా చరిత్రే మరి.
ఈ సందర్భంగా శ్రీపతి మాట్లాడుతూ.. మా గిరిజనులకు ఎలాంటి చట్టబద్ధమైన హక్కులు ఉన్నాయో మావాళ్లకు తెలియదు. వారిని చైతన్యవంతం చేయాలి. వారి హక్కులు వారు పొందేలా చేయాలి. అందుకే లా చదవాలని నిశ్చయించుకున్నాను. ఈమెకు ఇంటర్లో మంచి మార్కులు రావడంతో ఐదేళ్ల లాకోర్సులో చేరింది. చదువు సాగుతుండగానే అంబులెన్స్ డ్రైవర్‌గా పని చేసే వెంకటేశన్‌తో వివాహం జరిగింది. చదువు పూర్తయ్యాక సివిల్ జడ్జి పోస్ట్ కోసం టీఎన్పీఎస్సీ పరీక్ష రాసే సమయానికి నిండు చూలాలు. అయినప్పటికీ బిడ్డకు జన్మనిచ్చి పరీక్ష రాసింది. ఇప్పుడు రిజల్ట్స్ వచ్చి సివిల్ జడ్జిగా పోస్ట్ వచ్చింది. ఈ సంగతిని ప్రస్తావిస్తూ.. తమిళనాడు సి.ఎం స్టాలిన్, తమిళ సినీ ప్రముఖులు అభినందనలు తెలియచేశారు. తమిళ మీడియంలో చదువుకున్నవారికి ఉద్యోగాల్లో అవకాశం కల్పించే విధంగా ద్రవిడ మోడల్‌ను ప్రవేశ పెట్టడం వల్లే శ్రీపతి సివిల్‌జడ్జి కాగలిగిందని.. ఇలా మారుమూల ప్రాంతాల వారికి అవకాశం దక్కాలని స్టాలిన్ ఆకాంక్ష వ్యక్తం చేశారు.