హీరో నందమూరి తారకరత్న గుండెపోటుతో బెంగళూరులోని ఆస్పత్రిలో అడ్మిట్ అయిన సంగతి తెలిసిందే. ఏపీ టీడీపీ నాయకుడు నారా లోకేష్ ప్రారంభించిన యువగళం పాదయాత్రలో తారకరత్న పాల్గొన్నారు. ఈ సందర్భంగా తారకరత్న పాదయాత్రలో స్పృహ తప్పి పడిపోయాడు. కార్యకర్తలు ఆయన్ని కుప్పం హాస్పిటల్ కు తరలించగా హార్ట్ ఎటాక్ అని తెలిపారు. ఫస్ట్ ఎయిడ్ ట్రీట్ మెంట్ అందించాక మెరుగైన చికిత్స నిమిత్తం బెంగళూరులోని నారాయణ హృదయాలయా ఆస్పత్రికి తరలించారు. అయితే అప్పటికే తారకరత్న పరిస్థితి విషమించడంతో మూడు రోజుల నుంచి ఆయన వెంటిలేటర్ పై ఉన్నారు. మెరుగైన చికిత్స అందిస్తున్నట్లు వైద్యులు బులిటెన్ ను విడుదల చేశారు. నిన్న తాజా హెల్త్ బులిటెన్ ను కూడా ఆస్పత్రి సిబ్బంది విడుదల చేశారు.
హెల్త్ అప్డేట్ లో తారకరత్న పరిస్థితి ఇంకా విషమంగానే ఉందని తెలిపారు. తారకరత్నకి ఎలాంటి ఎక్మో సపోర్ట్ ఇవ్వడం లేదని, వెంటిలేటర్‌పైనే చికిత్స అందిస్తున్నట్లు స్పష్టం చేశారు. ప్రస్తుతం ఐసియూలో ఉన్న తారకరత్నని చూసేందుకు కుటుంబీకులు ఆస్పత్రి వద్దకు చేరుకుంటున్నారు. అయితే వైద్యులు ఆయన్ని చూసేందుకు నిరాకరిస్తున్నట్లు సమాచారం. ఇలాంటి సమయంలో తారకరత్నకు సంబంధించిన ఫోటో ఒకటి బయటకి వచ్చింది. అందులో తారకరత్న వెంటిలేటర్ పై చికిత్స పొందుతూ కనిపిస్తున్నాడు. ప్రస్తుతం ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వెంటిలేటర్ పై అపస్మారక స్థితిలో ఉన్న తారకరత్నను చూసిన అభిమానులు ఆయన త్వరగా కోలుకోవాలంటూ ఆశిస్తూ పోస్టులు పెడుతున్నారు.