Shahpur Kandi Barrage: ఉగ్రవాద పీడిత పాకిస్థాన్ కష్టాలు తగ్గే సూచనలు కనిపించడం లేదు. ఆర్థిక మాంద్యంతో సతమతమవుతున్న పొరుగు దేశం ఇప్పుడు జలకళను కోల్పోనుంది. షాపూర్ కంది డ్యామ్ పూర్తయిన తర్వాత పాకిస్తాన్‌కు వెళ్లే రావి నది నీటి ప్రవాహం పూర్తిగా నిలిచిపోయింది. ఈ విషయాన్ని స్థానిక మీడియా నివేదించింది. షాపూర్ కంది బ్యారేజ్ జమ్మూ-కశ్మీర్,పంజాబ్ సరిహద్దులో ఉంది. ఈ బ్యారేజీ నిర్మాణం తర్వాత పాకిస్థాన్‌కు వెళ్లే 1150 క్యూసెక్కుల నీటి ప్రయోజనం జమ్మూ కాశ్మీర్ ప్రజలకు అందనుంది. ఈ నీటితో కథువా, సాంబా జిల్లాల్లోని 32 వేల హెక్టార్ల భూమికి సాగునీరు అందుతుంది.
నీటిపారుదల, జలవిద్యుత్ ఉత్పత్తికి ముఖ్యమైన షాపూర్ కంది బ్యారేజ్ ప్రాజెక్ట్ గత మూడు దశాబ్దాలలో అనేక సవాళ్లను ఎదుర్కొంది. అయితే 29 ఏళ్ల తర్వాత ఇప్పుడు దాని నిర్మాణం పూర్తయింది. భారతదేశం, పాకిస్తాన్ మధ్య 1960లో సింధు జల ఒప్పందం కుదిరింది. దీని ప్రకారం రావి, సట్లెజ్, బియాస్ నదుల జలాలపై భారతదేశానికి హక్కులు ఉండగా, సింధు, జీలం, చీనాబ్ నదీ జలాలపై పాకిస్తాన్‌కు హక్కులు ఉన్నాయి.
షాపూర్ కంది బ్యారేజీ నిర్మాణం తర్వాత, రావి నది నీటిని నిలుపుకునే హక్కు భారతదేశానికి ఉంది. ఇంతకుముందు ఈ నీరు లఖన్‌పూర్ డ్యామ్ మీదుగా పాకిస్తాన్ వైపు ప్రవహించేది, కానీ ఇప్పుడు పంజాబ్, జమ్మూ కాశ్మీర్ ఈ నీటి ప్రయోజనం పొందుతాయి. ఈ ప్రాజెక్టుకు 1995లో పీవీ నరసింహారావు పునాది వేశారు. దీని తరువాత పంజాబ్, జమ్మూ కాశ్మీర్ ప్రభుత్వాల మధ్య అనేక వివాదాల కారణంగా, షాపూర్ కంది బ్యారేజీ పనులు ఆగిపోయాయి. ఆ తర్వాత 2014లో కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ ఈ అంశాన్ని ప్రధాని నరేంద్ర మోడీ ముందు ఉంచారు. ప్రధాని మోడీజోక్యం తర్వాత ఈ వివాదాలు పరిష్కరించబడ్డాయి. ఈ బ్యారేజీ పనులు 2018 లో మళ్లీ ప్రారంభమయ్యాయి.