మల్టీ లెవల్ మార్కెటింగ్ పేరుతో జనాలకు కుచ్చుటోపి పెడుతున్నారు. ఆ సంస్థలకు ప్రముఖులు ప్రచారం చేయడంతో ప్రజలు నమ్ముతుంటారు. క్యూనెట్ సంస్థ మోసాలు అన్నీ ఇన్నీ కావు. చైన్ మార్కెటింగ్‌తో దేశంలో రూ.5 వేల కోట్లకు పైగా మోసానికి పాల్పడింది. దీనికి టెన్నిస్ స్టార్ సానియా మీర్జా బ్రాండ్ అంబాసిడర్‌గా ఉన్నారు. వీటిని సెలబ్రిటీలు ప్రమోట్ చేయడం సరికాదని ఆర్టీసీ ఎంజీ సజ్జనార్ అన్నారు. వాటిని సపోర్ట్ చేయొద్దని ఆయన ట్వీట్ చేశారు. ఇలాంటి వాటి వల్ల దేశ ఆర్థిక వ్యవస్థ దెబ్బతింటుందని ఆందోళన వ్యక్తం చేశారు. సజ్జనార్ సైబరాబాద్ సీపీగా ఉన్న సమయంలో క్యూనెట్, ఇతర ఎంఎల్ఎం కంపెనీలపై చర్యలు తీసుకున్నారు.
ఈడీ సోదాలు..
క్యూనెట్‌లో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ గతవారం సోదాలు నిర్వహించింది. మనీలాండరింగ్, హవాలా ఆరోపణలపై తనిఖీలు చేపట్టింది. క్యూనెట్ అనుబంధం సంస్థ విహాన్ డైరెక్ట్ సెల్లింగ్ సంస్థల్లో సోదాలు జరిపింది. ఈ కేసుకు సంబంధించి ముంబై, బెంగళూరు, చెన్నై నగరాల్లో రైడ్స్ చేసింది. క్యూనెట్కు చెందిన 36 బ్యాంకుల్లో రూ.90 కోట్లను ఫ్రీజ్ చేశారు. ఈ క్రమంలో సజ్జనార్ స్పందించారు.
2019లో వెలుగులోకి
2019 జనవరిలో ‘క్యూనెట్’ మోసాలు వెలుగులోకి వచ్చాయి. అప్పటి సైబరాబాద్ సీపీ సజ్జనార్ ఎకనామిక్ అఫెన్సెస్ వింగ్‌ను రంగంలోకి దింపి క్యూనెట్‌పై ఉక్కుపాదం మోపారు. నిందితులను జైలుకు పంపారు. రూ. కోట్ల నగదును ఫ్రీజ్ చేశారు. కొంత విరామం ఇచ్చి.. మళ్లీ రంగంలోకి దిగింది. దీంతో అప్రమత్తంగా ఉండాలని, ప్రముఖులు ప్రచారం చేయొద్దని సజ్జనార్ కోరారు.
ఇక్కడ ప్రారంభం
1998లో హాంకాంగ్ కేంద్రంగా క్యూవన్ గ్రూపును జోసఫ్ బిస్మార్క్, విజయ్ ఈశ్వరన్ ఏర్పాటు చేశారు. నష్టాలు రావడంతో మూసివేశారు. 2001లో భారత్ వచ్చి గోల్డ్‌క్వెస్ట్ ఇంటర్నేషనల్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ ప్రారంభించారు. బంగారు కాయిన్ల పేరుతో బిజినెస్ చేశారు. 2004లో క్వెస్ట్‌నెట్ ఎంటర్ప్రైజెస్ పేరుతో గోల్డ్ కాయిన్స్, హాలిడే ట్రిప్స్ వంటి కార్యకలాపాలతో చాలామందిని మోసం చేశారు. విదేశాలకు వ్యాపారం విస్తరించి అమాయకులను చీట్ చేశారు.
స్తంభించిన కార్యకలాపాలు
2010లో ఆరోపణలు రావడంతో కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ వారి కంపెనీలపై ఉక్కుపాదం మోపింది. విచారణకు ఆదేశించడంతో సదరు సంస్థల కార్యకలాపాలు స్తంభించిపోయాయి. 2011లో విహాన్ డైరెక్ట్ సెల్లింగ్ ఇండియా పేరుతో మరో కంపెనీని ప్రారంభించారు. దానికి అనుబంధంగా క్యూనెట్ బ్రాండ్‌తో బిజినెస్, ఎడ్యుకేషన్, హెల్త్, జ్యువెల్లరీ, విహార యాత్ర పేర్లతో ఆకర్షణీయమైన ప్యాకేజీ తయారుచేశారు. చైన్ మార్కెటింగ్‌తో జనాలను మోసం చేశారు.
బాధితులు వీరే
మహారాష్ట్ర, కర్ణాటక, ఢిల్లీ తదితర రాష్ట్రాల్లో క్యూనెట్కు పెద్ద ఎత్తున బాధితులు ఉన్నారు. ఈ సంస్థలో అసలు ఎలాంటి రికార్డులు లేవని.. 100 రూపాయల విలువ చేసే వస్తువును 1500 రూపాయలకు అమ్ముతూ మోసాలకు పాల్పడ్డారని అధికారులు గుర్తించారు. మల్టీలెవెల్ మార్కెటింగ్ తో మాయాజాలం చేసిన క్యూనెట్.. దేశవ్యాప్తంగా లక్షలాది మందికి కుచ్చుటోపి పెట్టింది.