యూపీ రాజధాని లక్నో(Lucknow)లో ఓ కార్యక్రమంలో సమాజ్‌వాదీ పార్టీ నేత స్వామి ప్రసాద్ మౌర్యపై ఓ యువకుడు షూ విసిరాడు. దీంతో ఆగ్రహానికి గురైన ఎస్పీ కార్యకర్తలు నిందితుడిని పట్టుకుని తీవ్రంగా చిత్తగా కొట్టారు. అంతేకాకుండా పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి దుశ్చర్యకు పాల్పడుతుండగా అడ్డుకులోదని మండిపడ్డారు. ఈ నేపథ్యంలో పోలీసులు యువకుడిని అదుపులోకి తీసుకుని.. విచారిస్తున్నారు. మరోవైపు నిందితుడిని ఆకాష్ సైనీ(Akash Saini)గా గుర్తించారు. యువకుడు లాయర్ వేషంలో వచ్చినట్లు సమాచారం. అయితే ఈ దాడిలో బూటు(Shoe)స్వామి ప్రసాద్ మౌర్య (Swami Prasad Maurya) వద్దకు చేరకపోవడంతో తృటిలో బయటపడ్డాడు.
స్వామి ప్రసాద్ ఇటీవలి చేసిన వ్యాఖ్యలపై నిందితుడు తీవ్ర అసహనానికి గురయ్యాడని.. ఈ నేపథ్యంలో దాడి చేసినట్లు సమాచారం. యువకుడి దుశ్చర్యతో కార్యక్రమంలో గందరగోళ వాతావరణం నెలకొంది. మౌర్య ఉత్తర ప్రదేశ్ (UP) రాజకీయాల్లో పెరున్న వ్యక్తి. ఒకప్పుడు బీఎస్పీలో ఉన్న మౌర్య.. అనంతరం బీజేపీ (BJP)లో చేరి, ఆ తర్వాత బీజేపీకి టాటా చెప్పి అఖిలేష్ సైకిల్ ఎక్కారు. స్వామి ప్రసాద్ మౌర్య సుమారు నాలుగు దశాబ్దాల సుదీర్ఘ రాజకీయ అనుభవం కలిగిన వ్యక్తి. యూపీ రాజకీయాల్లో ఆయన బలీయమైన రాజకీయ నాయకుడని అంటారు. స్వామి ప్రసాద్ మౌర్య 1996లో రాయ్‌బరేలీ(Rae Bareli)లోని దాల్మావు అసెంబ్లీ స్థానం నుంచి బీఎస్పీ టిక్కెట్‌పై పోటీ చేసి అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించారు.
ఆయన కెరీర్లో 4 సార్లు క్యాబినెట్ మంత్రి అయ్యారు. యూపీ శాసనసభలో మూడుసార్లు ప్రతిపక్ష నేతగా కూడా పనిచేశారు. 2009లో కేంద్ర మంత్రి ఆర్‌పిఎన్ సింగ్ తల్లిని పద్రౌనా నుంచి ఉప ఎన్నికలో ఓడించిన తర్వాత మాయావతికి సన్నిహితంగా మెలిగిన నేతల్లో ఆయన ఒకరు. 2008లో స్వామి ప్రసాద్ మౌర్యకు బీఎస్పీ(BSP) రాష్ట్ర అధ్యక్ష బాధ్యతలు అప్పగించింది. 2012లో ఓటమి తర్వాత ఆ బాధ్యత నుంచి ఆయనను మాయావతి తొలగించారు. ఇక 2016లో స్వామి ప్రసాద్ మౌర్య బహుజన్ సమాజ్ పార్టీకి వ్యతిరేకంగా తిరుగుబాటు చేశారు. అనంతరం బీఎస్పీని విడిచిపెట్టి, తన సొంత పార్టీని స్థాపించారు. కానీ అంతలోనే పార్టీ బీజేపీలో కలిపారు. ఇక 2017లో స్వామి ప్రసాద్ మౌర్య అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించి మంత్రి పదవిని పొందారు. అనంతరం భారతీయ జనతపార్టీకి గుడ్ బై చెప్పి సమాజ్ వాదీ పార్టీలో చేరారు.