దేశంలో ప్రతి సంవత్సరం రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయేవారి సంఖ్య పెరిగిపోతోంది. ఈ క్రమంలో.. రోడ్డు ప్రమాదాలను తగ్గించే క్రమంలో రవాణా మంత్రుత్వ శాఖ కొత్త చట్టం తీసుకువచ్చింది. నాలుగు చక్రాల వాహనాల్లో కచ్చితంగా 6 ఎయిర్ బ్యాగ్స్ ఉండాలని ఈ చట్టంలో పేర్కొన్నారు.
నిజానికి.. కార్లలో 6 ఎయిర్‌బ్యాగ్‌లను అమర్చాలని చాలా కాలంగా చర్చలు జరుగుతున్నాయి, అది ఇప్పుడు అమలులోకి వచ్చింది. అక్టోబరు 1, 2023 నుంచి వాహనాల్లో 6 ఎయిర్‌బ్యాగ్‌లు తప్పనిసరి అని రవాణా మంత్రి నితిన్ గడ్కరీ గురువారం ప్రకటించారు. అయితే, ఇది M-1 కేటగిరీ ప్యాసింజర్ వాహనాలకు మాత్రమే వర్తిస్తుంది. గతంలో జారీ చేసిన నోటిఫికేషన్ ప్రకారం, 8 మంది ప్రయాణికుల సీటింగ్ సామర్థ్యం, 3.5 టన్నుల కంటే తక్కువ బరువున్న అన్ని వాహనాలు M-1 కేటగిరీకి వస్తాయి.
జనవరి 1, 2022 నుండి, అన్ని వాహనాల్లో డ్యూయల్ ఫ్రంట్ ఎయిర్‌బ్యాగ్‌లు తప్పనిసరి చేయబడ్డాయి. అయితే ప్రపంచవ్యాప్తంగా కొన్ని పరిమితుల కారణంగా ప్యాసింజర్ కార్లలో ఆరు ఎయిర్‌బ్యాగ్‌లను తప్పనిసరి చేయాలనే ప్రతిపాదనను ప్రభుత్వం ఒక సంవత్సరం పాటు వాయిదా వేసినట్లు గడ్కరీ తెలిపారు. “మోటారు వాహనాలలో ప్రయాణించే ప్రయాణికులందరి భద్రత మా ప్రాధాన్యత” అని గడ్కరీ ట్విట్టర్లో రాశారు.
గడ్కరీ మాట్లాడుతూ, భారతదేశంలోని చాలా ఆటోమొబైల్ తయారీదారులు 6 ఎయిర్‌బ్యాగ్‌లతో కూడిన కార్లను ఎగుమతి చేస్తున్నారని, అయితే భారతదేశంలో ధర కారణంగా వారు వెనుకాడుతున్నారని అన్నారు. ఎందుకంటే అదనపు ఎయిర్‌బ్యాగ్‌లను అమర్చడం వల్ల వాహనాల ధరలు పెరుగుతాయి, ఇది వాటి అమ్మకాలపై ప్రత్యక్ష ప్రభావం చూపుతుందని ఆయన అన్నారు.