YS Sharmila Has Send To Crop Loss Sample To CM KCR
Crop Loss Sample:అకాల వర్షం తెలంగాణ రైతంగానికి భారీ నష్టం మిగిల్చింది. పంట నష్టంపై వైఎస్ఆర్ టీపీ చీఫ్ షర్మిల (YS Sharmila) మీడియాతో మాట్లాడారు. ఆ తర్వాత పంట నష్టం శాంపిల్‌ను సీఎం కేసీఆర్‌కు పంపించారు. లోటస్ పాండ్ గేట్ నుంచి వాహనం బయటకు రాకుండా పోలీసులు అడ్డుకున్నారు. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితి నెలకొంది.
తెలంగాణ రాష్ట్రంలో 23 జిల్లాల్లో పంట నష్టం జరిగిందని వైఎస్ షర్మిల (YS Sharmila) అన్నారు. వరి, మక్క, మామిడి తోటలకు నష్టం జరిగిందని వివరించారు. మార్చి, ఏప్రిల్ నెలలో పడిన వర్షాలతో దాదాపు 10 లక్షల ఎకరాల్లో పంట నష్టం జరిగిందని తెలిపారు. మహబూబాబాద్, ఖమ్మం, జనగామలో మూడు రోజులపాటు పంటనష్టంపై వివరాల కోసం పర్యటించానని తెలిపారు. అప్పు చేసి రూ. 30-40 వేలు పెట్టుబడి పెడితే పంటలు ధ్వంసం అయ్యాయని రైతులు చెబుతున్నారు. ఇప్పుడు వచ్చే రాబడి అప్పు తీర్చడానికి కూడా సరిపోవని రైతులు బాధపడుతున్నారని గుర్తుచేశారు.
రైతులకు ముల్లు గుచ్చుకుంటే పంటితో తీస్తానని చెప్పిన కేసీఆర్ ఇప్పుడు ఏం చేస్తున్నారని షర్మిల (YS Sharmila) అడిగారు. ఇది కిసాన్ సర్కార్ అని డబ్బాలు కొట్టుకంటున్న కేసీఆర్ రాష్ట్రంలో రైతులకు ఏం సమాధానం చెబుతారని నిలదీశారు. మార్చి నెలలో పంట నష్టం జరిగితే వాళ్లను ఆదుకోలేదని పేర్కొన్నారు. మార్చి నెలలో ఖమ్మం, వరంగల్ , కరీంనగర్ జిల్లాలలో పంట నష్టం జరిగిందని.. కేసీఆర్ గాలి మోటార్లో తిరిగి గాలి మాటలు చెప్పారే తప్ప సాయం చేయలేదన్నారు. 2 లక్షల 34 వేల ఎకారాల్లో పంట నష్టం జరిగిందని.. ప్రతి రైతుకు ఎకరాకు 10 వేల చొప్పున పరిహారం ఇస్తామని చెప్పి ఇప్పటికీ వేయలేదన్నారు.
2 లక్షల 34 వేల ఎకరాల నష్టం జరగగా 234 కోట్ల రూపాయలు విడుదల చేస్తామని చెప్పి.. ఇప్పుడు మాట మారుస్తూ లక్షా 51 వేల ఎకరాల్లో మాత్రమే పంట నష్టం జరిగిందని మాట్లాడుతున్నారని విరుచుకుపడ్డారు. ఏప్రిల్‌లో కురిసిన వర్షాలతో మళ్లీ లక్షల ఎకరాల్లో పంటనష్టం జరిగిందని షర్మిల అన్నారు. ఏప్రిల్‌లో 9 లక్షల 60 వేల ఎకరాలకు పంట నష్టం జరిగిందని అంచనా అయితే.. కేసీఆర్ లెక్కన ఎకరానికి 10 వేల చొప్పున 960 కోట్ల రూపాయలు రైతులకు చెల్లించాల్సి ఉంటుందని చెప్పారు. రైతుల వద్దకు అధికారి, ఎమ్మెల్యే వచ్చింది లేదు, చూసింది లేదని షర్మిల (YS Sharmila) అన్నారు.
మార్చి నెలలో జరిగిన పంట నష్టంపై అధికారులు సరైన వివరాలు తీసుకోలేదని రైతులు చెబుతున్నారు. 5 ఎకరాల్లో పంట నష్టపోతే ఒక ఎకరం రాసుకున్నారని షర్మిల (YS Sharmila) తెలిపారు. తప్పుగా రాసుకొని 2 లక్షల 34 వేల ఎకరాలు అని చెప్పి మళ్లీ అది కూడా కాదని లక్షా 51 వేల ఎకరాలే అని చెప్తున్న వారు ఏప్రిల్‌లో నష్టపోయిన రైతులను ఆదుకుంటారని ఎలా నమ్మాలని అడిగారు.
రైతులకు మునుపటిలా ఇన్ పుట్ సబ్సిడీ లేదు, ఎరువుల మీద సబ్సిడీ లేదు, విత్తనాల మీద సబ్సిడీ లేదన్నారు. పంట బీమా కూడా లేదన్నారు. 9 ఏళ్లలో కేసీఆర్ ఒక్క రైతుకైనా, ఒక్క రూపాయైనా పంట నష్ట పరిహారం ఇచ్చారా? అని షర్మిల అడిగారు. ఏటా 1500 కోట్ల వరకు పంట నష్టం జరుగుతుందన్నారు. తొమ్మిదేళ్లలో 14 వేల కోట్ల రూపాయలు నష్టపోతే కేసీఆర్ ఒక్క రూపాయి అయినా ఇచ్చారా? అని నిలదీశారు. పంట నష్టం తెలుసుకోవడానికి చేసిన పర్యటనలో రైతులు నష్టపోయిన పంటను ట్రక్కులో కేసీఆర్‌కు బహుమతిగా పంపిస్తున్నామని తెలిపారు. రైతులు తమ భార్యల పుస్తెలు తాకట్టు పెట్టి పంట పండిస్తే వచ్చిన ఫలితం ఇది అని చెప్పారు. కేసీఆర్ వెళ్లని సచివాలయానికి 1600 కోట్లతో ఖర్చు పెట్టారు.. రైతులు నష్టపోయిన పంటను సచివాలయం ముందో, ప్రగతి భవన్ ముందో, ఫాం హౌజ్ ముందో పెట్టుకొని నాలుగైదు రోజులు చూస్తే అయినా సాయం చేయాలనే మనసు వస్తుందెమో చూడాలని అన్నారు.
రబ్బరు చెప్పులతో స్కూటర్ పై తిరిగే కేసీఆర్.. ఇప్పుడు పార్టీ అకౌంట్లో 1250 కోట్ల రూపాయలు ఉన్నాయి. ఏ డబ్బులు లేని వీళ్లు జాతీయ పార్టీలు పెడుతున్నారు. కేసీఆర్ , కేసీఆర్ కుటుంబానికి బంగారు తెలంగాణ అయ్యిందన్నారు. కాళేశ్వరం, మిషన్ భగీరథ, సచివాలయం, మిషన్ కాకతీయ మీ మ్యానిఫెస్టోలో ఉందా? అని అడిగారు. రుణమాఫీ చేస్తాం, ఇంటికో ఉద్యోగం ఇస్తాం, పేదలకు డబుల్ బెడ్ రూం ఇళ్లు, నిరుద్యోగ భ్రతి, 57 ఏళ్లకే పెన్షన్, ఉచిత ఎరువులు, సున్నా వడ్డీకే రుణాలు, కేజీ టూ పీజీ ఉచిత విద్య అని చెప్పారు.