Etala Rajender: కేసీఆర్.. ఆ సొమ్ము నీ అబ్బ జాగీరా, ఈటల విసుర్లు
సీఎం కేసీఆర్పై బీజేపీ ముఖ్యనేత ఈటల రాజేంధర్ ఫైరయ్యారు. ప్రజల సొమ్ముతో భవనాలు నిర్మిస్తే.. సొంత డబ్బులతో నిర్మించినట్టు కలరింగ్ ఇస్తారెంటీ అని మండిపడ్డారు.
Etala Rajender: సీఎం కేసీఆర్పై బీజేపీ ముఖ్య నేత, ఎమ్మెల్యే ఈటల రాజేందర్ (Etala Rajender) హాట్ కామెంట్స్ చేశారు. డబుల్ బెడ్ రూమ్, క్యాంప్ ఆఫీసు మేం కట్టించామని అనడంపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. నీ అబ్బ జాగీరా అంటూ ఈటల రాజేందర్ మండిపడ్డారు. గవర్నమెంట్ ఆఫీస్ కడితే మేం కట్టామని చెబుతారా అని అడిగారు. 119 నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలకు క్యాంప్ ఆఫీసు కడితే మీరు కట్టించినట్టా.? అవీ ప్రజల సొమ్ము అని స్పష్టంచేశారు. ప్రజల సొమ్ముతో ప్రగతి భవన్ నిర్మించారని గుర్తుచేశారు. సీఎం కేసీఆర్ వాడుతున్న కారు, డీజిల్ కూడా జనం సొమ్మేనని స్పష్టంచేశారు. సీఎం కేసీఆర్ తినే మెతుకులు కూడా ప్రజలవే అనే విషయం గుర్తుంచుకోవాలని కోరారు. కళ్లు నెత్తికి ఎక్కాయా..? మాడి మసైపోతావ్ అని ధ్వజమెత్తారు.
కేసీఆర్ ఇంట్లో నుంచి ఇచ్చారా..?
ఏ స్కీమ్ నుంచి నగదు ఇస్తే కేసీఆర్ ఇంటి నుంచి ఇచ్చినట్టు మాట్లాడతారని తెలిపారు. ముఖ్యమంత్రి ప్రజల డబ్బుకు కాపాలాదారుడు మాత్రమే, తప్ప ఓనర్ కాదన్నారు. సీఎం పెద్ద జీతగాడు అని.. ఓనర్లు ప్రజలు అవుతారని గుర్తుచేశారు. ఉమ్మడి రాష్ట్రంలో అప్పటి సీఎం కిరణ్ కుమార్ రెడ్డికి ఇదే విషయం చెప్పా.. ఇప్పుడు చెబుతున్నానని తెలిపారు. 10 ఏళ్ల పాలన అంటూ సంబరాలు చేస్తున్నారు.. ఏం పొడిచారని ఈటల రాజేందర్ (Etala Rajender) అడిగారు. రోజుకు ఒక్కో డిపార్ట్ మెంట్ చేత సంబరాలు చేయించారని, మొన్న విద్యాశాఖ సంబరాలు చేసిన సమయంలో ఓ విద్యార్థి ట్రాక్టర్ కింద పడి చనిపోయాడని ఈటల రాజేందర్ గుర్తుచేశారు. మీ కార్యక్రమంలో విద్యార్థి చనిపోయాడని.. ఆ కుటుంబానికి రూ.25 లక్షల ఆర్థిక సాయం చేయాలని కోరారు. అలాగే స్కూల్లో మృతుని కుటుంబానికి అటెండర్ పోస్ట్ ఇప్పించాలని డిమాండ్ చేశారు.
రూ.4 లక్షలే ఇచ్చారు
హుజురాబాద్ నియోజకవర్గంలో దళిత కుటుంబాలు 17 వేల ఉంటాయని ఈటల రాజేందర్ (Etala Rajender) చెప్పారు. ఇప్పటికీ పూర్తిస్థాయిలో దళితబంధు రాలేదని.. కొందరికీ రూ.4 లక్షలు, రూ.5 లక్షలు మాత్రమే ఇచ్చారని వివరించారు. షాపు, బర్లు, బిజినెస్ పెట్టుకున్నవారిని కొటేషన్ తీసుకురా అని తిప్పుతున్నారని వివరించారు. లంచం సమర్పించేందుకు సరిపోతుందన్నారు. ఇదే విషయం వరంగల్, కరీంనగర్ కలెక్టర్లకు ఫోన్ చేసి అడిగానని గుర్తుచేశారు. నియోజకవర్గంలో అందరికీ దళితబంధు ఇవ్వాలని.. సగం ఇచ్చినవారికి మిగతా అమౌంట్ ఇవ్వాలని కోరారు. గిరజన బంధు అని చెప్పి.. ఇవ్వలేదని చెప్పారు. పేదరికంలో ఉన్న కాపు, ముదిరాజ్, పద్మశాలీలకు బీసీలకు ఇచ్చే రూ.లక్ష సాయం చేయాలని డిమాండ్ చేశారు. ఎన్నికలు వచ్చినప్పుడే బీసీలు గుర్తుకొస్తారని ఈటల రాజేందర్ (Etala Rajender) అన్నారు. బీసీలు, పెన్షన్ పేరుతో మోసం చేస్తారని మండిపడ్డారు. బీసీల రూ. లక్ష నగదు స్కీమ్ గడువు పెంచాలని డిమాండ్ చేశారు. ఆ పథకం వచ్చిన తర్వాత క్యాస్ట్, ఇన్ కం తీసుకోవాలని కోరారు.
ఉద్యోగుల్లో అసహనం
ప్రజలను హింసించొద్దని ఈటల రాజేందర్ (Etala Rajender) సూచించారు. పీఆర్సీ పేరుతో వేధించి.. వీఆర్ఏ, పంచాయతీ సెక్రటరీలను ఎలా మోసం చేశారని గుర్తుచేశారు. చివరికీ మహిళలకు కూడా వడ్డీలేని రుణం పేరుతో ఛీట్ చేశారని తెలిపారు. తాను అసెంబ్లీలో నిలదీస్తే రూ.750 కోట్లు మంజూరు చేశారని.. మరో రూ.3700 కోట్లు రావాల్సి ఉందన్నారు. అప్పుల పాలు చేసి.. బిల్లులు ఇవ్వడం లేదు, జీతాలు ఇవ్వడం లేదని మండిపడ్డారు. వచ్చే ఎన్నికల్లో సర్వే సంస్థలకు అంతుపట్టని రిజల్ట్ వస్తోందని ఈటల రాజేందర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. దశాబ్ది ఉత్సవాల కోసం రూ.100 కోట్లు అని.. రూ.200 కోట్లు ఖర్చు చేయడం అవసరమా అని అడిగారు. స్థానిక సంస్థలు కూడా ఇష్టమొచ్చినట్టు ఖర్చు చేస్తున్నాయని వివరించారు.
ఉద్యమకారులపై రాళ్లు వేసిన వారు
హుజురాబాద్లో నిజమైన ఉద్యమకారులు నిర్మించుకున్న స్థూపం ప్లేస్లో కొత్తది ఏర్పాటు చేయడాన్ని ఈటల రాజేందర్ (Etala Rajender) ఖండించారు. మానుకోటలో ఉద్యమకారులపై రాళ్లు వేసి, ఉద్యమకారుల రక్తం కళ్ల చూసిన వారు ఇప్పుడు స్థూపం ఆవిష్కరిస్తారా అని అడిగారు. పిచ్చి సంప్రదాయాలను తెరలేపకండి అని సూచించారు. తెలంగాణలో ప్రతీకార రాజకీయాలు లేవని.. ఇప్పుడు అలాంటి పరిస్థితి తీసుకొచ్చారని వివరించారు. రెండు పార్టీలు కలిస్తే గొడవ జరిగే పరిస్థితి వచ్చిందన్నారు. తాను ఎవరు, ఎప్పడు ఎవరితో గొడవ పెట్టుకోలేదని.. తనకు శత్రువులు లేరని ఈటల రాజేందర్ అన్నారు. చెప్పిన పని చేయడమే తన బాధ్యత అన్నారు. తనకు గ్రూపులు లేవని, ఈర్ష్య పడే గుణం లేదన్నారు.