తెలంగాణలో నిరుద్యోగం రోజురోజుకి ఎంత పెరిగిపోతుందో అనడానికి ఈ వీడియో నిదర్శనమని చెప్పవచ్చు. ఒకే ఒక్క పోస్ట్‌కు ఓ కంపెనీ వాక్ ఇన్ ఇంటర్వూ నిర్వహించగా వందలాది మంది నిరుద్యోగులు వచ్చారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
Viral Video: రాష్ట్రానికి పెద్ద పెద్ద ఇండస్ట్రీలు తీసుకువచ్చా. లక్షల మందికి ఉద్యోగాలు కల్పించామని తెలంగాణ ప్రభుత్వం చెబుతున్నప్పటికీ రాష్ట్రంలో నిరుద్యోగం ఇంకా పెరిగిపోతూనే ఉంది. దేశంలో నిరుద్యోగం ఎక్కువగా ఉన్న రాష్ట్రాల్లో తెలంగాణ ఒకటి. ప్రతి ఏడాది తెలంగాణలో నిరుద్యోగులు పెరుగుతున్నారు. ఎన్నో ఐటీ కంపెనీలు తెలంగాణకు తీసుకొచ్చామని ప్రభుత్వం చెబుతోంది. కానీ ఈ వీడియో చూస్తే నిరుద్యోగం అంతా ఇక్కడే ఉన్నట్లు కనిపిస్తుంది. హైదరాబాద్‌లోని ఓ ఐటీ ఆఫీస్ కేవలం ఒక్క పోస్ట్‌కు వాక్ ఇన్ ఇంటర్వూ నిర్వహించగా వందలాది మంది నిరుద్యోగులు వచ్చారు.
ఐటీ కంపెనీలో ఒకే పోస్ట్‌కు ఖాళీ ఉంది. ఇంట్రెస్ట్ ఉన్న వ్యక్తులు రెజ్యూమ్ తీసుకుని ఇంటర్వూకి రండి అని టైమ్, డేట్ ఫిక్స్ చేసింది. ఒకే ఒక్క పోస్ట్ కదా.. ఒక 20 మంది వస్తారని కంపెనీ యాజమాన్యం భావించింది. కానీ ఒక్కసారిగా వందలాది మంది రావడంతో కంపెనీ ఆశ్చర్యపడింది. ఆ ఆఫీసు బయట అంతా జాతరను తలపించింది. దీనిని ఓ అభ్యర్థి వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో ప్రస్తుతం వైరల్ అవుతోంది. ఒక్కసారిగా ఇంతమంది ఇంటర్వూకి రావడంతో ఆఫీస్ సిబ్బంది వాళ్లను కంట్రోల్ చేయలేక ఇబ్బంది పడ్డారు. కొందరు నెటిజన్లు నిరుద్యోగానికి ఈ వీడియో నిదర్శనమని కామెంట్లు చేయగా.. మరికొందరు ఐటీ రంగంలో స్వర్ణయుగం ముగిసినట్లేనని కామెంట్లు చేస్తున్నారు.