»Violation Of Election Code Notices To Minister Ktr
KTR: ఎన్నికల కోడ్ ఉల్లంఘన.. మంత్రి కేటీఆర్‌కు నోటీసులు
ప్రగతి భవన్ వేదికగా ఎన్నికల ప్రచారం జరిగిందని, మంత్రి కేటీఆర్‌పై ఫిర్యాదులు అందినట్లుగా కేంద్ర ఎన్నికల సంఘం తెలిపింది. ఈ తరుణంలో మంత్రి కేటీఆర్‌కు నోటీసులు జారీ చేసింది. దీనిపై వివరణ ఇవ్వాలని ఎలక్షన్ కమిషన్ కోరింది.
తెలంగాణ (Telangana)లో ఎన్నికల షెడ్యూల్ విడుదలైన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఎన్నికల కోడ్ (Election Code) అమలులోకి రాగా ఈసీ గట్టి చర్యలు చేపట్టింది. కోడ్ ఉల్లంఘనలకు పాల్పడిన వారిపై కేంద్ర ఎన్నికల సంఘం చర్యలు తీసుకోనుంది. తాజా మంత్రి కేటీఆర్ (KTR) ఎన్నికల కోడ్ ఉల్లంఘించారని ఎన్నికల అధికారులకు ఫిర్యాదు అందింది. ప్రగతి భవన్ వేదికగా ఎన్నికల ప్రవర్తన నియమావళి ఉల్లంఘనలు జరిగినట్లుగా హైదరాబాద్ జిల్లా ఎన్నికల అధికారి, జీహెచ్ఎంసీ కమిషనర్ రొనాల్డ్ రాస్కు పలువురు ఫిర్యాదు చేశారు.
ప్రగతి భవన్ (Pragati Bhavan)కు రిటర్నింగ్ అధికారి, ప్రవర్తన నియమావళి బృందాలు, ఫ్లయింగ్ స్క్వాడ్లు చేరుకుని విచారణ చేపట్టినట్లు రొనాల్డ్ రాస్ తెలిపారు. కోడ్ ఉల్లంఘనలపై మంత్రి కేటీఆర్‌ను వివరణ కోరారు. ఈ సందర్భంగా కేటీఆర్‌కు నోటీసులు జారీ చేసినట్లు వెల్లడించారు. పూర్తి విచారణ తర్వాత కేంద్ర ఎన్నికల సంఘానికి నివేదిక పంపుతామని ఆయన పేర్కొన్నారు. చట్టప్రకారం ప్రభుత్వ బంగ్లాలు, అతిథి గృహాల నుంచి ఎన్నికల ప్రచారం చేయకూడదు. ఈ విషయాన్ని ఎన్నికల అధికారి వివరించారు.
జీహెచ్ఎంసీ (GHMC) ప్రధాన కార్యాలయంలో రొనాల్డ్ రాస్ ప్రెస్‌మీట్ పెట్టారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ (CM KCR)పై తమకు ఎటువంటి ఫిర్యాదులు అందలేదని, ఎన్నికల నిబంధనలకు విరుద్ధంగా ప్రగతి భవన్లో పార్టీ కార్యకలాపాలు నిర్వహిస్తున్నట్లు ఇతర పార్టీల నుంచి తమకు ఫిర్యాదులు అందినట్లు తెలిపారు. వాటిపై విచారణ చేపడుతున్నామని వెల్లడించారు.
సీఎం కేసీఆర్, బీఆర్ఎస్ (BRS) అభ్యర్థులకు బీఫారాలను ప్రగతి భవన్ వేదికగా అందజేయడంపై గతంలో కూడా ఎన్నికల సంఘానికి ప్రతిపక్షాలు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. ఎన్నికల కోడ్ నిబంధనలకు విరుద్ధంగా సీఎం అధికారిక నివాసంలో పార్టీ కార్యకలాపాలు చేపడుతూ తమ అభ్యర్థులకు బీఫారాలు అందజేశారని ఆ ఫిర్యాదులో తెలిపారు. దీనిపై ప్రగతి భవన్ నిర్వహణ అధికారులకు ఈసీ నోటీసులు (Election Commission Notices) జారీ చేసింది.