Kotha Prabhakar Reddy: మెదక్ ఎంపీ, దుబ్బాక బీఆర్ఎస్ అభ్యర్థి కొత్త ప్రభాకర్‌రెడ్డి ఆరోగ్యం నిలకడగా ఉంది. ఆయనపై హత్యాయత్నం జరిగిన సంగతి తెలిసిందే. ఎన్నికల ప్రచారంలో ఉండగా ఓ వ్యక్తి ఆయనపై కత్తితో దాడి చేశాడు. దీంతో కడుపులో తీవ్రగాయం కావడంతో యశోద ఆసుపత్రి వైద్యులు ఆయనకు సర్జరీ చేశారు. ప్రస్తుతం ఆయనకు చికిత్స కొనసాగుతోంది. వైద్యుల పర్యవేక్షణలో ఉన్నారు. నాలుగు రోజులు ఆయన ఐసీయూలోనే ఉండాలని వైద్యులు సూచించారు. వారం రోజుల పాటు విశ్రాంతి అవసరమన్నారు.
దర్యాప్తు చేస్తున్న పోలీసులు:
కొత్త ప్రభాకర్‌రెడ్డిపై హత్యాయత్నం కేసును పోలీసులు సీరియస్‌గా తీసుకున్నట్లు తెలిపారు. కేసు దర్యాప్తును సిద్ధిపేట పోలీసులు వేగవంతం చేశారు. ఘటనా సమయంలో రాజుతో పాటు మరో ఇద్దరు వ్యక్తులు ఉన్నట్లు గుర్తించారు. ఈ విషయాన్ని పోలీసులకు సర్పంచ్ నరసింహులు తెలిపారు. నిందితుడు రాజుపై 307 సెక్షన్ కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు. నిందితుడు రాజుకి హైదరాబాద్ గాంధీ ఆసుపత్రిలో చికిత్స అందిస్తుండగా ఆయన కోలుకున్నాక కోర్టులో ప్రవేశపెట్టనున్నారు.
కోడి కత్తితో పోల్చడం ఏంటని హరీశ్ రావు ఫైర్:
మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డిపై దాడి జరిగితే ఖండించాల్సిన పోయి ప్రతిపక్షాలు కోడికత్తి అనడం ఏంటని మంత్రి హరీశ్‌రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. కత్తి దాడిలో తీవ్రంగా గాయపడి చికిత్స పొందుతున్న కొత్త ప్రభాకర్ రెడ్డిని పలువురు మంత్రులు పరామర్శించారు. నిందితుల కాల్ డేటాను పోలీసులు సేకరించారని, ఒకటి రెండు రోజుల్లో ఈ కుట్ర కోణాన్ని పోలీసులు బయటపెడతారని హరీశ్ రావు తెలిపారు.
తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం:
కొత్త ప్రభాకర్‌రెడ్డిపై హత్యాయత్నం జరగడంతో తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. తెలంగాణలోని ఎమ్మెల్యేలు, ఎంపీలకు ప్రభుత్వం భద్రతను పెంచుతున్నట్లు ప్రకటన చేసింది. ప్రస్తుతం ఉన్న 2+2 భద్రతను 4+4కు పెంచుతూ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు అన్ని జిల్లాల అధికారులకు ఇంటెలిజెన్స్ డీజీ ఆదేశాలిచ్చారు. ఎన్నికల ప్రచార సమయాల్లో కూడా పోలీసుల భద్రతను పెంచనున్నట్లు పోలీసులు తెలిపారు.