పెద్దపల్లి జిల్లా పాలకుర్తి జెడ్పీటీసీ (ZPTC) కందుల సంధ్యారాణి ఎమ్మెల్యే కోరుకంటి చందర్ పై సంచలన ఆరోపణలు చేశారు. గత ఎన్నికలపుడు ఎమ్మెల్యే తన కాళ్లపైన పడ్డారని, అందుకే తామంతా చందాలు వేసుకుని ఎన్నికల ప్రచారానికి ఖర్చు చేశామని వివరించారు. ఊరూరా తిరిగి ప్రచారం చేసి ఎమ్మెల్యే చందర్ (Mla Chander)ను గెలిపించుకున్నామని తెలిపారు. అయితే, ఎమ్మెల్యేగా ఎన్నికైన తర్వాత చందర్ ఇవన్నీ మరిచిపోయారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు ఆర్ఎఫ్సీఎల్ (RFCL) బూడిద, ఇసుక, ఉద్యోగాలను అమ్ముకుని చందర్ కోట్లు దండుకున్నారని తీవ్ర విమర్శలు చేశారు.
గడిచిన ఇరవై ఏళ్లుగా తనను అవమానిస్తూనే ఉన్నారని సంధ్యారాణి (Sandhya Rani)కన్నీటిపర్యంతమయ్యారు. సంధ్యారాణి బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేశారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ తరఫున అసెంబ్లీ టికెట్ ఆశించిన సంధ్యారాణికి నిరాశే ఎదురైంది. ఈసారి కూడా సిట్టింగ్ లకే టికెట్ ఇస్తున్నట్లు పార్టీ అధినేత సీఎం కేసీఆర్ (CM KCR) ప్రకటించడంతో సంధ్యారాణి అసంతృప్తికి లోనయ్యారు. పార్టీ టికెట్ కోసం చివరి వరకూ ప్రయత్నించి విఫలమయ్యారు. దీంతో బీఆర్ఎస్ కు తాజాగా గుడ్ బై చెప్పారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో రామగుండం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా నిలబడతానని ఈ సందర్భంగా సంధ్యారాణి స్పష్టం చేశారు. ‘రామగుండం నియోజకవర్గ ప్రజలను కొంగు చాపి అడుగుతున్నా.. ఒక్కసారి నాకు అవకాశం ఇవ్వండి’ అంటూ కన్నీళ్లతో సంధ్యారాణి విజ్ఞప్తి చేశారు.