BRS : ఎన్నికల్లో ఘోర ఓటమి.. బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో దొంగతనం
తెలంగాణలో వరుసగా మూడోసారి అధికారం కైవసం చేసుకోవాలని అనుకున్న బీఆర్ఎస్ పార్టీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేయడం ఖాయమైంది.
BRS : తెలంగాణలో వరుసగా మూడోసారి అధికారం కైవసం చేసుకోవాలని అనుకున్న బీఆర్ఎస్ పార్టీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేయడం ఖాయమైంది. హస్తం పార్టీ 64 స్థానాల్లో గెలిచి రేవంత్ రెడ్డి రేపు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. కాగా, సారు కారు పార్టీ 39సీట్లకే పరిమితం అయింది. గులాబీ పార్టీ ఘోర పరాజయానికి పలు కారణాలు కనిపిస్తున్నాయి. వరుసగా రెండు పర్యాయాలు అధికారంలో ఉన్న పార్టీ మీద ప్రజల్లో వ్యతిరేకత రావడం సహజం. బీఆర్ఎస్ విషయంలో కూడా అదే జరిగింది. పలు జిల్లా కేంద్రాల్లోని నియోజకవర్గాల ఎమ్మెల్యేలు ఓడిపోవడంతో బీఆర్ ఎస్ పార్టీ కార్యాలయాల వద్ద పార్టీ శ్రేణుల హడావుడి తగ్గింది. దీంతో ఇదే అదునుగా చూసిన కొందరు కేటుగాళ్లు ఆ ఆఫీసుల పై కన్నేశారు. ఆఫీసులోని సామగ్రిని దొంగలించేందుకు ప్రయత్నించారు.
వివరాల్లోకి వెళితే.. జయశంకర్ భూపాలపల్లి జిల్లా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో చోరీ జరిగింది. భూపాలపల్లి నియోజకవర్గంలో బీఅర్ఎస్ అభ్యర్థి గండ్ర వెంకటరమణారెడ్డి ఓటమి పాలయ్యారు. దీంతో భూపాలపల్లిలోని పార్టీ కార్యాలయంలో కార్యకర్తల సందడి తగ్గింది. ఇదే అదునుగా చూసిన కొందరు కేటుగాళ్లు మంగళవారం రాత్రి కార్యాలయం వెనుక నుంచి అద్దాలు పగలగొట్టి ఆఫీస్ లోకి ప్రవేశించి.. అందులో ఉన్న రెండు కంప్యూటర్లను దొంగిలించారు. మాజీ ఎమ్మెల్యే రమణారెడ్డి పీఏ వినోద్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఇది గిట్టని కాంగ్రెస్ కార్యకర్తల పనే అని అనుమానిస్తున్నారు.