»Telangana Distribution Of Bathukamma Sarees For Women From Tomorrow
Telangana: మహిళలకు తీపికబురు..రేపటి నుంచి బతుకమ్మ చీరల పంపిణీ
రేపటి నుంచి తెలంగాణలో బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమం జరగనుంది. బతుకమ్మ పండగను పురస్కరించుకుని ఈసారి కోటికి పైగా చీరలను సీఎం కేసీఆర్ సర్కార్ సిద్ధం చేసింది.
తెలంగాణ (Telangana) సర్కార్ మహిళలకు తీపికబురు చెప్పింది. బతుకమ్మ పండగ (Batukamma Festival) కానుకగా రేపటి నుంచి చీరల పంపిణీ చేపట్టనుంది. ప్రతి ఏడాదిలాగానే ఈ ఏడాది కూడా బతుకమ్మ చీరలను పంపినీ చేయనుంది. ఈ కార్యక్రమాన్ని రేపటి నుంచి ప్రారంభించనున్నట్లు వెల్లడించింది. ఇప్పటికే 80 శాతం బతుకమ్మ చీరలు పంపిణీ కేంద్రాలకు చేరినట్లు తెలిపింది.
ఈ ఏడాది రూ.354 కోట్ల వ్యయంతో చేనేత సంఘాల ఆధ్వర్యంలో 1.02 కోట్ల చీరలను పంపిణీకి సిద్ధం చేసినట్లు తెలంగాణ సర్కార్ వెల్లడించింది. జరీ చీరలతో పాటుగా వివిధ రంగుల కాంబినేషన్‌తో 250 డిజైన్లలో ఆకర్షణీయంగా చీరలను సర్కార్ తయారు చేయించింది. బతుకమ్మ పండగ సందర్భంగా ఆ చీరలను పంపిణీ చేయనుంది.
తెలంగాణలో 18 ఏళ్లు నిండిన ఆడపడుచులకు అక్టోబర్ 4వ తేది నుంచి బతుకమ్మ చీరలను ప్రభుత్వం పంపిణీ చేయనుంది. ఇందు కోసం ప్రభుత్వం ఇప్పటికే అన్ని ఏర్పాట్లు చేసింది. ప్రతి ఏటా సుమారుగా కోటి మంది మహిళలకు ఈ బతుకమ్మ చీరలను సర్కార్ పంపిణీ చేస్తుండగా ఈ ఏడాది కూడా కోటికి పైగా చీరలను తయారు చేయించింది.
స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారుల ఆధ్వర్యంలో ఈ బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమం జరగనుంది. ఇందు కోసం అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. వివిధ రకాల ఆకర్షణీయమైన రంగులతో, థ్రెడ్ బోర్డర్, దారపు పోగుల అంచులతో 100 శాతం పాలిస్టర్ ఫిలిమెంట్ నూలు చీరలను ప్రభుత్వం తయారు చేయించిందని అధికారులు వెల్లడించారు.